Share News

అప్పులపై దుష్ప్రచారం.. మంత్రి జూపల్లికి హరీశ్‌రావు లేఖ..

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:03 PM

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌‌రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు.

అప్పులపై దుష్ప్రచారం.. మంత్రి జూపల్లికి హరీశ్‌రావు లేఖ..
Harish Rao letter to Jupally Krishna Rao

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలు, ఆర్బీఐ గణాంకాలు సహా పలు ఆధారాలను మంత్రి జూపల్లి వాట్సాప్‌కు పంపినట్లు వెల్లడించారు.


హరీశ్‌రావు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తీసుకున్న రుణాలు, ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు కలిపి మొత్తం రూ.4.17 లక్షల కోట్లేనని అసెంబ్లీలో వివరించినట్లు తెలిపారు. ఆ లెక్కలపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని అప్పుడే ప్రకటించానని గుర్తు చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు రూ.1,77,058 కోట్ల అప్పు చేసినట్లు మంత్రి జూపల్లి తన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2026 జూన్ 30 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,86,067 కోట్లుగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు.


మరోవైపు, 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం, ఇతర అన్ని రకాల రుణాలు కలిపి రూ.3,47,294 కోట్లుగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ తమ లెక్కలను మార్చడం లేదని, కాంగ్రెస్ మాత్రం సందర్భానుసారంగా అప్పుల అంకెలను మారుస్తోందని విమర్శించారు. తమ అంచనాల ప్రకారం వివిధ మార్గాల ద్వారా ప్రస్తుత ప్రభుత్వం సుమారు రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన అసెంబ్లీ వీడియోలు, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు, ఆర్బీఐ అధికారిక గణాంకాలను మంత్రి జూపల్లి వాట్సాప్‌కు పంపినట్లు తెలిపారు. వాటిని పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలని కోరిన హరీశ్‌రావు, ఇకనైనా అప్పుల అంశంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.


Also Read:

దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..

ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది: దీప్తి శర్మ

Updated Date - Jul 03 , 2026 | 05:12 PM