ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది: దీప్తి శర్మ
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:40 PM
భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్‌ల గురించి టీమిండియా మహిళా పేసర్ దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరిలో ఓ అరుదైన గుణం ఉందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్‌ల గురించి టీమిండియా మహిళా పేసర్ దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరిలో ఓ అరుదైన గుణం ఉందని తెలిపింది. ఎంతటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే అరుదైన లక్షణం వీరిద్దరిలో ఉందని దీప్తి శర్మ వెల్లడించింది. వింబుల్డన్ టోర్నీకి వెళ్లిన దీప్తి.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడింది.
‘జకోవిచ్ ప్రస్తావన వస్తే అందరూ ముందుగా అతడి మానసిక దృఢత్వం గురించే చెబుతుంటారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అతడు పోరాటం మాత్రం ఆపడు. క్రికెట్‌లో ఇలాంటి లక్షణాలు ఎంఎస్ ధోని సర్‌లో కనిపిస్తాయి. ఆయన కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళన పడకుండా మ్యాచ్‌ను అద్భుతంగా ముగిస్తారు. ధోని సర్, జకోవిచ్ ఇద్దరిలోనూ ఓ అరుదైన గుణం ఉంది. అత్యంత కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉంటారు. వారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు’ అని దీప్తి శర్మ తెలిపింది.
ఇది నా చిరకాల కోరిక..
‘వింబుల్డన్‌కు వచ్చి ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడటం నా చిరకాల కోరిక. టీవీలో మాత్రమే ఈ మ్యాచ్‌లు చూసేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి లైవ్ మ్యాచ్‌లు చూడటం అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. నాకు జకోవిచ్ అత్యంత ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్. కోర్టులో అతడు పోరాడే తీరు నన్నెంతో ఆకట్టుకుంటుంది. అతడి ఆట ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. నా చిన్నప్పుడు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేదాన్ని. కానీ కొంతకాలంగా జకోవిచ్ ఆటనే ఎక్కువగా ఫాలో అవుతున్నా’ అని దీప్తి తెలిపింది. వింబుల్డన్‌కు తనతో పాటు ఎవరిని తీసుకెళ్లాలని అనుకుంటారనే ప్రశ్న ఎదురవ్వగా.. ‘సచిన్ సర్, రవిశాస్త్రి సర్, సునీల్ గావస్కర్ సర్‌లను నాతో తీసుకెళ్లాలనుకుంటా. వారి క్రీడా ప్రపంచంలో దిగ్గజాలు. వారితో కలిసి టెన్నిస్ మ్యాచ్ చూస్తూ వారి విశ్లేషణ వినడం గొప్ప అనుభవంగా ఉంటుంది’ అని దీప్తి శర్మ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
తొందరపాటు నిర్ణయాలు తీసుకోను.. రిటైర్‌మెంట్‌పై రొనాల్డో క్లారిటీ
ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది: ఏబీ డివిలియర్స్