Maharashtra Civic Polls: పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:47 PM
నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముంబై: బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగాల్సి ఉండగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి పలు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది. ఎన్నికలు లేకుండానే 68 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాయుతి భాగస్వాములైన బీజేపీ 44 సీట్లు గెలుచుకోగా, ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేన 22 సీట్లు గెలుచుకుంది. 2 స్థానాలను అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ దక్కించుకుంది.
కల్యాణ్-డోంబివ్లిలో 15 మంది బీజేపీ అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందారు. బివాండి, పాన్వెల్, జలగావ్‌లో తలో 6 సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ధులేలో నలుగురు, అహిల్యానగర్‌లో ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. పుణె, పింప్రి-చించ్వాడ్‌లలో రెండేసి స్థానాలను ఆ పార్టీ పోటీ లేకుండా దక్కించుకుంది. థానేలో 7, కల్యాణ్-డోంబివ్లిలో చెరో ఆరు స్థానాలను శివసేన గెలుచుకుంది. అహిల్యానగర్‌లో ఎన్‌సీపీ 2 సీట్లను సొంతం చేసుకుంది. మాలేగావ్‌లో స్థానిక ఇస్లామిక్ పార్టీ అభ్యర్థి కూడా పోటీలేకుండా గెలిచాడు.
కాగా, పలుచోట్ల ఏకగ్రీవ విజయాలపై అధికార మహాయుతి ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కూటమి విజయభేరి మోగించింది.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్కూల్స్‌లో న్యూస్ పేపర్ తప్పనిసరి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి