Russian Oil Imports: రష్యా, యూఎస్ నుంచి చమురు దిగుమతులు.. రిఫైనరీలను వివరాలు కోరిన కేంద్రం
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:30 PM
వారం వారం ఏ మేరకు రష్యా, యూఎస్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలని కేంద్రం రిఫైనరీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందన్న వార్తల నడుమ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదిరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా, అమెరికాల నుంచి ప్రతి వారం ఎంత మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నారో వెల్లడించాలని రిఫైనరీలను కేంద్రం కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Center Seeks info on Russian Oil Imports).
వారాల వారీగా దిగుమతులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఇంధన శాఖకు చెందిన పెట్రోలియమ్, ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ రిఫైనరీలను కోరినట్టు సమాచారం. కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని కూడా కేంద్రం పేర్కొందట. అయితే, ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
సాధారణంగా రిఫైనరీల దిగుమతుల వివరాలు నెలవారీగా కస్టమ్స్ విభాగం వద్ద అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రతి వారం ఈ లెక్కలు కావాలని కేంద్రం కోరడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
2022 తరువాత రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇంధన నిధులు ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. రష్యా చమురు దిగుమతులను తగ్గించాలని భారత్‌పై ఒత్తిడి చేస్తోంది. అయితే, జాతీయ ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇక సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చాలా కాలంగా భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు అమెరికాతో ఈ తరహా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. యూఎస్ వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించేందుకు కేంద్రం కుదరదని జులైలో తేల్చి చెప్పడం ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభనకు దారి తీసింది. పాక్, భారత్‌కు మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే పేర్కొనడం, భారత్ తోసిపుచ్చడంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
ఆ తరువాత మళ్లీ భారత్, అమెరికా మధ్య చర్చలు కొనసాగాయి. ట్రంప్, ప్రధాని మోదీలు సోషల్ మీడియాలో సహృద్భావ సందేశాలు ఇచ్చుకున్నా వాణిజ్య ఒప్పందం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రష్యా చమురు దిగుమతులే చర్చల పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారాయని సమాచారం. అయితే, రష్యా చమురు దిగుమతులు తగ్గించుకోవాలని కేంద్రం రిఫైనరీలకు ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
యూఎస్‌లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ
ఆందోళనకారులను చంపుతుంటే చూస్తూ ఊరుకోబోం.. ట్రంప్ హెచ్చరిక