Share News

FBI Foils Terror Plot: యూఎస్‌లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం.. భగ్నం చేసిన ఎఫ్‌‌బీఐ

ABN , Publish Date - Jan 03 , 2026 | 08:55 AM

ఐసిస్ ఉగ్రసంస్థ ప్రోద్బలంతో నార్త్ కెరొలీనా రాష్ట్రంలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ టీనేజర్‌ను అరెస్టు చేసినట్టు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తాజాగా తెలిపింది. నిందితుడు మైనర్‌గా ఉన్న సమయం నుంచే అతడిపై నిఘా పెట్టి కుట్రను భగ్నం చేసినట్టు తెలిపింది.

FBI Foils Terror Plot: యూఎస్‌లో భారీ ఉగ్రదాడికి టీనేజర్ యత్నం.. భగ్నం చేసిన ఎఫ్‌‌బీఐ
FBI Foils Terror Attack In North Carolina

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ శుక్రవారం తెలిపింది. ఐసిస్ ఉగ్ర సంస్థ ప్రోద్బలంతో ఓ 18 ఏళ్ల యువకుడు న్యూఇయర్ వేడుకల సందర్భంగా నార్త్ కెరొలీనా రాష్ట్రంలో దాడికి దిగేందుకు కుట్ర పన్నాడని చెప్పింది. 2022 నుంచీ అతడిపై నిఘా పెట్టి ఆట కట్టించామని తెలిపింది. ఓ ఐసిస్‌ హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్న నిందితుడు అతడి సూచనలతో దాడికి ప్లాన్ చేసినట్టు అధికారులు తెలిపారు (FBI Foils Terror Attack in North Carolina).

ఇటీవలే నిందితుడు క్రిస్టియన్ స్టర్డివాంట్‌ను (18) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2022లో నిందితుడు మైనర్‌గా ఉన్న సమయంలోనే అతడిపై నిఘా పెట్టినట్టు తెలిపారు. విదేశాల్లోని ఓ ఐసిస్ హ్యాండ్లర్‌తో అతడు టచ్‌లో ఉండేవాడని చెప్పారు. నల్ల దుస్తులు ధరించి, సుత్తి, కత్తులతో జీహాదీ తరహా దాడి చేయాలని స్టర్డివాంట్‌కు ఐసిస్ హ్యాండ్లర్ సూచించినట్టు గుర్తించారు. తనని తాను అతివాదిగా పరిచయం చేసుకున్న ఓ అధికారి స్టర్డివాంట్‌తో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు తన ప్లాన్స్‌ను ఆయనతో పంచుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.


డిసెంబర్ 29న అధికారులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ‘న్యూయార్క్ దాడి- 2026’ అని రాసున్న చిన్న చిట్టీని స్వాధీనం చేసుకున్నారు. కత్తులు, మాస్క్ తదితర వస్తులతో జాబితా కూడా చిట్టీలో రాసున్న వైనాన్ని గుర్తించారు. పోలీసుల చేతిలో మరణించే లోపు పలువురిపై కత్తులు, సుత్తితో దాడి చేయాలన్న పథకం గురించి కూడా ఆ నోటులో రాసి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు అమెరికా ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు.

ఈ ఉగ్రకుట్రను భగ్నం చేయడంలో తమకు సహకరించిన వారందరికీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు. ఈ దాడి కోసం నిందితుడు ఏడాదిగా ప్లాన్ చేస్తున్నట్టు యూఎస్ అటార్నీ రస్ ఫెర్గ్యుసన్ పేర్కొన్నారు. ‘అతడు జీహాద్ కోసం సిద్ధమయ్యాడు. ఎందరో అమాయకులు ప్రమాదంలో పడ్డారు’ అని కామెంట్ చేశారు.


ఇవీ చదవండి:

ఆందోళనకారులను చంపుతుంటే చూస్తూ ఊరుకోబోం.. ట్రంప్ హెచ్చరిక

అనుమతి ఉంటేనే సౌదీకి మందులు తీసుకెళ్లొచ్చు: ఎన్ఎస్‌బీ

Updated Date - Jan 03 , 2026 | 09:26 AM