ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:33 PM
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ సాధించిన విజయాలను ప్రశ్నిస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత సి.జోసెఫ్ విజయ్‌కు మరో కొత్త సవాలు ఎదురైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టీవీకే విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే గెలుపును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు స్పందించింది న్యాయస్థానం. సీఎం విజయ్, కేంద్ర ఎన్నికల సంఘం మూడు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. అలాగే సదరు పిటిషన్లపై కొన్ని ప్రక్రియాపరమైన అంశాలనూ లేవనెత్తుతూ, వాటిని సరిదిద్దుకోవాలని జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ధర్మాసనం సూచించింది.
పెరంబూర్‌లో విజయ్ చేతిలో ఓడిన డీఎంకేకు చెందిన ఆర్‌డీ.శేఖర్, అదే నియోజకవర్గానికి చెందిన దినేశ్, లక్ష్మీనరసింహన్ అనే మరో ఇద్దరు ఓటర్లతో కలిసి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తిరుచ్చి ఈస్ట్ ఫలితాన్ని సవాల్ చేస్తూ డీఎంకేకు చెందిన ఎస్.ఇనిగో ఇరుదయరాజ్ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. విజయ్ ఎన్నికల ప్రచారంలో చిన్నారులను భావోద్వేగపూరితంగా ఉద్దేశించి, వారి ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ప్రభావితం చేసేలా ప్రసంగించారని ఆరోపించారు. ఇది ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించరాదన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సాక్ష్యంగా చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో ఏప్రిల్ 21న విజయ్ ప్రచార ప్రసంగానికి సంబంధించిన వీడియోలను సమర్పించారు. అదేవిధంగా ప్రచార గీతాల రూపకల్పనకు సంబంధించిన ఖర్చులను ఎన్నికల వ్యయాల్లో చూపలేదని, ఆస్తుల అఫిడవిట్‌లో ఆదాయపు పన్ను బకాయిల వివరాల్లోనూ వ్యత్యాసాలున్నాయని పిటిషనర్లు ఆరోపించారు. అలాగే ఏప్రిల్ 19న సెయింట్ ఆంటోనీ చర్చిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారన్న అంశాన్నీ ప్రస్తావించారు.
మరోవైపు.. విల్లివాక్కం ఎమ్మెల్యే, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పైనా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే తిరువణ్నామలై ఎమ్మెల్యే ఈవీ.వేలు, టీవీకేలో చేరిన మాజీ డీఎంకే ఎమ్మెల్యే ఎస్.జయకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే తరగై కుత్‌బర్ట్ ఎన్నికల విజయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైనా న్యాయస్థానం వారికి నోటీసులు పంపింది. కొందరు ప్రతివాదులు జులై 21లోపు తమ సమాధానాల్ని తెలపాలని ఆదేశించింది.
ఇవీ చదవండి:
షాకింగ్.. పామును తింటున్న జింక.. ఆశ్చర్యకర కారణం ఏంటంటే..
లంచ్ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం..