తీవ్ర రూపం దాల్చిన విద్యార్థుల నిరసనలు.. యుద్ధ విమానంపైకి ఎక్కి..
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:04 PM
ఆదివారం ఉదయం పంజాబ్‌లో ఎల్‌పీయూ విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23యూఎమ్‌పైకి ఓ విద్యార్థి ఎక్కి నిరసన తెలియజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వదంతులు వ్యాపించగా.. విద్యార్థులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో భాగంగా ఆదివారం ఉదయం క్యాంపస్‌లో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన మిగ్-23యూఎమ్ విమానంపైకి ఓ విద్యార్థి ఎక్కారు. మరో పదిమంది విద్యార్థులు మిలిటరీ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసన తెలియజేశారు.
క్యాంపస్‌లో నినాదాలు చేస్తూ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. కొందరు కిటికీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అక్కడక్కడ యూనివర్సిటీ భవనాలకు నిప్పంటించారు. అలాగే వారు సమీపంలో ఉన్న జలంధర్-ఫగ్వారా నేషనల్ హైవేను దిగ్బంధించి రాకపోకలకు అంతరాయం కలిగించారు.
అసలేం జరిగింది..
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని శనివారం రాత్రి సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. సెప్టెంబర్ 24న యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న ఓ యువతిపై కొందరు దారుణానికి ఒడిగట్టారని వారు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం వదంతులను కొట్టిపాడేసింది. అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపింది. వాటిని విశ్వసించొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది.
ఈ వార్తలూ చదవండి
మహిళపై అత్యాచార వదంతులు.. యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు
తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?