మహిళపై అత్యాచార వదంతులు.. యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:00 AM
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహిళపై అత్యాచారం జరిగిందన్న వదంతులు వ్యాపించడంతో విద్యార్థులు భారీ నిరసనకు తెరతీశారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహిళపై అత్యాచారం జరిగిందని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందన్న వదంతులు వ్యాపించడంతో విద్యార్థులు భారీ నిరసనకు తెరతీశారు. అక్కడున్న ఓ భవనానికి కొందరు నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులతో చర్చించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. అయితే, విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
మహిళ అత్యాచారంపై వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించడంతో సుమారు 2 వేల మంది విద్యార్థులు అర్ధరాత్రి దాటాక గర్ల్స్ హాస్టల్‌కు చేరుకుని నిరసనకు దిగారు. హైవేపై కూడా నిరసనకు దిగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో కొందరు హాస్టల్ కిటికీలపై రాళ్లు విసరారు. అక్కడున్న పూల కుండీలను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల నిప్పు రాజేశారు.
ఈ క్రమంలో పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఎస్ఎస్పీ సమక్షంలో యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఈ ఘటనలపై యూనివర్సిటీ కూడా స్పందించింది. అవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. దురద్దేశంతోనే ఇలాంటి వదంతులు వ్యాపించినట్టు కనిపిస్తోందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. వాస్తవాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జలంధర్ రేజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. నేడు మధ్యాహ్నం విద్యార్థి నేతలు, యూనివర్సిటీ వర్గాల మధ్య మరొోసారి చర్చలు జరుగుతాయని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?
పాక్‌కు ఉగ్రవాదం అలవాటైంది: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్