గుండెపోటుతో సీఐ మృతి.. హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:16 PM
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బందోబస్తు విధులకు హాజరైన నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతిచెందారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బందోబస్తు విధులకు హాజరైన నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ గుండెపోటుతో మృతిచెందారు. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొంతమంది నిరసనకారులను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న సీఐ అహ్మద్ అలీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అహ్మద్ అలీ మృతిచెందారు. అప్పటివరకు తమతో కలిసి బందోబస్తు విధుల్లో పాల్గొన్న సీఐ మృతిచెందిన విషయం తెలిసి పోలీసు సిబ్బంది దిగ్భ్రాంతికి లోనైయ్యారు. సీఐ అకస్మాత్తుగా మరణించడంతో పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.
హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి..
సీఐ అహ్మద్ అలీ ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉండగానే అస్వస్థతకు గురై మృతిచెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందించే పోలీసు కుటుంబంలో సమర్థవంతమైన అధికారిని కోల్పోవడం బాధాకరమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఐ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గ్రామాలకు మహర్దశ.. పల్లె పండుగ 3.0 కింద రూ. 11 వేల కోట్లతో పనులు
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల బకాయిల చెల్లింపులకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్