Makar Sankranti Feast: తేజ్ మకరసంక్రాతి విందుకు లాలూ.. మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:17 PM
తేజ్ ప్రతాప్‌పై గత ఏడాది మేలో ఆర్జేడీ బహిష్కరణ వేటు వేసింది. 12 ఏళ్లుగా తాను ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్ పోస్టులో తేజ్ ప్రకటించడంతో లాలూ కుటుంబంలో చిచ్చు రేగింది.
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబంలో తలెత్తిన విభేదాలు క్రమంగా చక్కబడుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. బిహార్ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ (Tej Pratap) బహిష్కరణకు గురయ్యాడు. ఈ క్రమంలో మకర సంక్రాంతి సందర్భంగా తేజ్ ప్రతాప్ బుధవారంనాడు ఏర్పాటు చేసిన 'దహీ-చురా' విందులో లాలూ పాల్గొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సైతం ఈ విందుకు హాజరయ్యారు.
దీనికి ఒకరోజు ముందు మంగళవారంనాడు పాట్నాలోని తన తల్లి రబ్రీదేవి నివాసానికి తేజ్ ప్రతాప్ వెళ్లారు. లాలూ, రబ్రీ, తమ్ముడు తేజస్వి యాదవ్‌తో ఆయన భేటీ అయ్యారు. 'దహీ-చురా' విందుకు రావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో కొద్దికాలంగా ఇంటిపట్టునే లాలూ ఉంటున్నారు. అయితే తేజ్ ఆహ్వానం మేరకు బుధవారం ఆయన నివాసానికి వెళ్లి విందులో పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నలకు లాలూ స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి నేపథ్యంలో తేజ్‌తో తిరిగి కుటుంబ సంబంధాలు నెరపాలని లాలూ ఆలోచన కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
తేజ్ ప్రతాప్‌పై గత ఏడాది మేలో ఆర్జేడీ బహిష్కరణ వేటు వేసింది. 12 ఏళ్లుగా తాను ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్ పోస్టులో తేజ్ ప్రకటించడంతో లాలూ కుటుంబంలో చిచ్చు రేగింది. తేజ్‌ను ఆర్జేడీ నుంచి, కుటుంబం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు లాలూ ప్రకటించారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ సొంతంగా జేజేడీ పార్టీని ఏర్పాటు చేసి పలువురు అభ్యర్థులను బరిలోకి దిగారు. అయితే ఆ పార్టీ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు.
డిప్యూటీ సీఎం విందుకు తేజ్
కాగా, బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా మంగళవారంనాడు ఇచ్చిన మకర సంక్రాంతి విందుకు తేజ్ హాజరుకావడం కూడా పలు ఊహాగానాలకు తావిచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో తేజ్ చేరవచ్చనే ప్రచారం జరిగింది. ఇటు జేడీయూ సీనియర్ నేత రత్నేశ్ సదా సైతం మకర సంక్రాంతి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆయన మంత్రివర్గ సహచరులు పలువురు ఈ విందులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన కోల్‌కతా హైకోర్టు
బీజేపీతో పొత్తుండదు.. తెగేసి చెప్పిన టీవీకే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి