Share News

నితీశ్ కోసం 9 మందిని చంపించా: జేడీయూ ఎమ్మెల్యే అనంత్

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:25 PM

జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం తాను 9 మందిని చంపించానని ఆయన చెప్పారు. బిహార్‌లో రానున్న మండలి ఎన్నికల్లో తన ప్రత్యర్థి నీరజ్ కుమార్‌ను నిలబెట్టడంతో పార్టీ నాయకత్వపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

నితీశ్ కోసం 9 మందిని చంపించా: జేడీయూ ఎమ్మెల్యే అనంత్

ఇంటర్‌నెట్ డెస్క్: జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ కోసం తాను 9 మందిని చంపించానని ఆయన చెప్పారు. బిహార్‌లో రానున్న మండలి ఎన్నికల్లో తన ప్రత్యర్థి నీరజ్ కుమార్‌ను నిలబెట్టడంతో పార్టీ నాయకత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నీరజ్‌పై విమర్శలు చేస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘నితీశ్‌కు, నాకు మధ్య చాలా కాలంగా సంబంధం ఉంది. ఆయనకు సాయం చేసేందుకు 9 మందిని నేను హత్య చేయించా. కష్టకాలంలో నితీశ్ వెంట ఉన్నాను. రాజకీయంగా నిలదొక్కుకునే సమయంలో ఆయనకు అండగా నిలిచాను’ అని అనంత్ ఓ వార్తా సంస్థతో అన్నారు. అలాగే, నీరజ్‌పైనా విమర్శలు గుప్పించారు. తనకు ఏ వ్యక్తితో అభిప్రాయ భేదాలు ఉన్నాయో, ఆ వ్యక్తికి పార్టీ నామినేట్ చేయడం కరెక్టు కాదన్నారు. కాగా.. తాను చేసిన వ్యాఖ్యలపై అనంత్ యూ టర్న్ తీసుకున్నారు. వాస్తవానికి మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ హయాంలో తన సహాయకులు 9 మంది హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. నితీశ్ కుమార్ వైపు మొగ్గు చూపడంతో తన 9 మంది సహాయకులను లాలు హత్య చేయించారని చెప్పారు.


ఆర్జేడీ మండిపాటు..

అనంత్ వ్యాఖ్యలపై లాలు నేత‌త్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) స్పందించింది. రాజకీయ నేరాలు చేసినట్లు అనంత్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఆ పార్టీ నేత శక్తి సింగ్ యాదవ్ అన్నారు. ‘నితీశ్ కుమార్ కోసం 9 హత్యలు చేయించినట్లు అనంత్ ఒప్పుకున్నారు. నితీశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హత్యలు జరిగాయి. తర్వాత కేంద్రం, రాష్ట్ర నాయకత్వం నుంచి ఒత్తిడి కారణంగా అనంత్ తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు. బిహార్‌లో కరడుగట్టిన నేరగాళ్లతో చేతులు కలిపి నితీశ్ అధికారంలోకి వచ్చారన్నది వాస్తవం కాదా?’ అని శక్తి సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు.


జేడీయూ దూరం..

అనంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ అన్నారు. అనంత్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. నితీశ్ రాజకీయ జీవితంలో ఎలాంటి మరకలు లేవని ఆయన అన్నారు. నేరస్తులతో నితీశ్ ఎప్పుడూ చేతులు కలపలేదని, హింసకు పాల్పడలేదని పేర్కొన్నారు.


ఈ వార్తలూ చదవండి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం

Updated Date - Oct 17 , 2026 | 05:41 PM