జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:06 PM
జమ్మూకశ్మీర్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వరదల ధాటికి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలైన రాజౌరి, పూంచ్ జిల్లాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల ధాటికి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనావాసాల్లోకి నీరు చేరింది. దీంతో పలుచోట్ల నివాస భవనాలు దెబ్బతినగా, మరికొన్ని చోట్ల రహదారులు తెగిపోయి, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు.. నదులు, వాగుల సమీపానికి వెళ్లొద్దని అధికారులు సూచించారు. కాగా.. ప్రభుత్వం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే సహాయక చర్యలను వేగవంతం చేసింది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల