Share News

BJP-Congress Alliance: కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:59 PM

డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్‌లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు.

BJP-Congress Alliance: కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్
Devendra Fadnavis

ముంబై: రాజకీయ ప్రత్యర్థులు అధికారం కోసం కొత్త పొత్తులకు తెరతీయడం మహారాష్ట్ర (Maharashtra)లో తాజాగా సంచలనమైంది. అంబర్‌నాథ్, అకోలా మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ నేతలు కాంగ్రెస్, అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎంతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ కొత్త 'పొత్తులు' రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పొత్తులు ఆమోదయోగ్యం కాదని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్థానిక బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇలాంటి ఏర్పాట్లకు పార్టీ అధిష్టానం ఎంతమాత్రం అంగీకరించదని, ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రకటించారు.


'కాంగ్రెస్, ఎంఐఎంతో కుదుర్చుకునే ఎలాంటి పొత్తులను ఆమోదించే ప్రసక్తే లేదు. స్థానిక నేతలు ఎవరైనా సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది క్రమశిక్షణారాహిత్యమే అవుతుంది. వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఈమేరకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం' అని మీడియాతో మాట్లాడుతూ ఫడ్నవిస్ చెప్పారు.


వివాదం ఏమిటి?

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలు (మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీలు) గత ఏడాది డిసెంబర్‌లో రెండు విడతలుగా జరిగాయి. 62 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంది. బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈనెల 15న ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్‌లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమికి 'అంబర్‌నాథ్ వికాస్ అఘాడి' అనే పేరు పెట్టారు. ఇదే తరహాలో అకోటా మున్సిపల్ కౌన్సిల్‍లో భిన్న సిద్ధాంతాలున్న బీజేపీ, అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పార్టీలు చేతులు కలిపాయి. ఈ పరిణామాలను విపక్ష శివసేన (యూబీటీ) తప్పుపట్టింది. తమ సౌలభ్యం కోసం అపవిత్ర పొత్తులు పెట్టుకుంటారా అంటూ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించింది.


క్రమశిక్షణా చర్యలు తీసుకున్న కాంగ్రెస్

మరోవైపు, అధిష్టానం అనుమతి లేకుండా అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీతో తమ నేతలు పొత్తులు కుదుర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. కొత్తగా ఎన్నికైన 12 మంది కౌన్సిలర్లను సస్పెండ్ చేసింది. బ్లాక్ ప్రెసిడెంట్‌ ప్రదీప్ పాటిల్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. అంబర్‌నాథ్ బ్లాక్ యూనిట్‌ను రద్దు చేసింది.


ఇవి కూడా చదవండి..

వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2026 | 06:06 PM