Share News

Delhi Turkman Gate Mosque: ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు.. పోలీసులపై రాళ్ల దాడి

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:01 AM

అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు 30 బుల్డోజర్లను, 50 డంప్ ట్రక్‌లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు. మసీదు విషయంలో మాత్రం దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

Delhi Turkman Gate Mosque: ఉద్రిక్తతకు దారి తీసిన అక్రమ నిర్మాణాల తొలగింపు.. పోలీసులపై రాళ్ల దాడి
Delhis Turkman Gate Mosque

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొంతమంది దుండగులు పోలీస్ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్‌లీల మైదాన్‌లోని తుర్క్‌మన్ గేట్ వద్ద సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు, శ్మశాన వాటిక ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దాదాపు 300 మంది అధికారులు రంగంలోకి దిగారు.


ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మంగళవారం రాత్రి తొలగింపు పనులు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున దాదాపు 20 నుంచి 30 మంది దుండగులు అధికారులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించక తప్పలేదు. దుండగుల దాడిలో ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మసీదుకు సంబంధించిన ఫంక్షన్ హాల్, డిస్పెన్సరీని అధికారులు కూల్చేశారు. రాళ్ల దాడి సంఘటనపై సీనియర్ పోలీస్ అధికారి నిధిన్ వల్సన్ మాట్లాడుతూ.. రాళ్ల దాడి చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిస్థితి ఇప్పుడు నూటికి నూరు శాతం కంట్రోల్‌లో ఉందన్నారు.


దాదాపు 100 వీడియోల ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీస్ అధికారి తెలిపారు. గాయపడ్డ మున్సిపల్ సిబ్బంది, పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. కాగా, అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు 30 బుల్డోజర్లు, 50 డంప్ ట్రక్‌లను ఉపయోగించారు. రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను తొలగించారు. మసీదు విషయంలో మాత్రం దుండగులు రాళ్ల దాడికి పాల్పడి.. అధికారులను గాయపరిచారు. రాళ్ల దాడికి పాల్పడ్డవారిని వీలైనంత త్వరగా గుర్తించి శిక్షిస్తామని అధికారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

జేఎన్‌టీయూలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

ఇండియా వద్దంటే.. పాకిస్తాన్‌లో ఆడతా: ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం

Updated Date - Jan 07 , 2026 | 11:46 AM