Sukma Maoists Surrender: ఛత్తీస్‌గఢ్‌లో మరో 26 మంది మావోయిస్టుల సరెండర్
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:16 PM
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం 26 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం మరికొంత మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో సీనియర్ పోలీసు అధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు 26 మంది లొంగిపోయారు. వీరిలో 13 మందిపై మొత్తం రూ. 65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. పోరుబాట వీడిన వారి పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పూనా మార్గెమ్ కార్యక్రమంలో భాగంగా నక్సల్స్ లొంగిపోయినట్టు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. గెరిల్లా దళాలతో పాటు దక్షిణ బస్తర్, మాద్ డివిజన్, ఆంధ్ర ఒడిశా బార్డర్ డివిజన్‌లో ఈ మావోయిస్టులు క్రియాశీలకంగా ఉండేవారని ఎస్పీ తెలిపారు (Maoists Surrender in Sukma District Chhattisgarh).
తాజాగా లొంగిపోయిన వారిలో లాలీ అలియాస్‌పై ముచాకీ లఖ్మూపై అత్యధికంగా రూ.10 లక్షల రివార్డు ఉంది. కోరాపుట్ రోడ్డులో 2017 నాటి ఐఈడీ బాంబు పేలుడు ఘటనలో లఖ్మూ పాత్ర ఉందని పోలీసులు తెలిపారు. నాటి ఘటనలో 14 మంది భద్రతా సిబ్బంది మరణించారని చెప్పారు. హెమ్లా లఖ్మా, ఆస్మితా అలియాస్ కామ్లూ సాన్నీ, పదమ్ జోగీ, సందమ్ పాలేలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఉద్యమబాట వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వీరికి తక్షణ ఆర్థిక సాయంగా ఒక్కొక్కరికీ రూ.50 వేలు ఇచ్చినట్టు కూడా ఎస్పీ తెలిపారు. ఇతర మావోయిస్టులు కూడా తక్షణం హింసామార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. జనజీవనస్రవంతిలో కలిసే వారందరికీ భద్రమై, గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్
వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే