పంజాబ్లో ఉపాధి హామీ కార్మికులపై దూసుకెళ్లిన కారు.. 8 మంది దుర్మరణం
ABN , Publish Date - Oct 18 , 2026 | 08:08 PM
పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉపాధి హామీ కార్మికులపై కారు దూసుకెళ్లడంతో 8 మంది కార్మికులు చనిపోయారు. సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖర్ రోడ్డులో ఆదివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉపాధి హామీ కార్మికులపై కారు దూసుకెళ్లడంతో 8 మంది కార్మికులు చనిపోయారు. సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగాగా-జఖర్ రోడ్డులో ఆదివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 25 మంది కార్మికులు రోడ్డు పక్కన పనిచేసుకుంటూ ఉండగా.. ఒక కారు అకస్మాత్తుగా వారిపై నుంచి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. మిగతా ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు వెల్లడించారు. అలాగే, గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. మృతులందరినీ సంగ్రూర్ జిల్లా లెహ్రాగాగా సమీపంలోని అలిషెర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఇక.. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను గుర్తించామని, అతడిని ట్రేస్ చేశామని సంగ్రూర్ పోలీస్ సూపరింటెండెంట్ పల్విందర్ చీమా తెలిపారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. అతడిని పర్గాత్ సింగ్ అలియాస్ కాలాగా గుర్తించామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారుకు పంజాబ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందని వెల్లడించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పంజాబ్ క్యాబినెట్ మంత్రి కుమార్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ వార్తలూ చదవండి
దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి
రాత్రి నూడిల్స్ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!