కోల్కతా దుర్గాపూజ తొక్కిసలాట.. 19 మంది మృతి, ఏడుగురి అరెస్ట్
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:51 PM
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దుర్గాపూజ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చోర్బగాన్ దుర్గాపూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దుర్గాపూజ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చోర్బగాన్ దుర్గాపూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూజా కమిటీ నిర్వాహకులు సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జనసమూహాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యం జరిగిందా? భద్రతా ఏర్పాట్లలో లోపాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది (Kolkata Durga Puja Stampede).
అక్టోబర్ 17, శనివారం రాత్రి సుమారు 7.40 గంటల సమయంలో ఉత్తర కోల్కతాలోని చోర్బగాన్ దుర్గాపూజ మండపం వద్ద ఈ ఘటన జరిగింది. దుర్గాపూజలో ఏడో రోజైన సప్తమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో వర్షం నుంచి తప్పించుకునేందుకు పలువురు మండపం వైపు పరుగులు తీశారు. ఇరుకైన వీధిలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు కిందపడటంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం (Seven Arrested Kolkata).
ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 19 మంది మృతి చెందారు (Chorbagan Durga Puja). మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కోల్కతా పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో పూజా కమిటీ కార్యదర్శి రాజ్కుమార్ సెవ్డా, ఉపాధ్యక్షుడు శంతను దూబే ఉన్నారు. మండపం వద్ద వెదురు నిర్మాణ పనుల్లో పాల్గొన్న బిప్లబ్ ముఖర్జీతో పాటు జనసమూహాన్ని నియంత్రించే బాధ్యతలు నిర్వహించిన కౌశిక్ సాహా, పింటు డేలను కూడా అరెస్టు చేశారు. ప్రైవేటు భద్రతా సిబ్బంది పర్యవేక్షకులు సుమన్ చక్రవర్తి, రాజేశ్ పాల్ కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొలుత 14 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..