Share News

దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:42 AM

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట జరిగి 17 మంది మృతి చెందారు. మరో 35 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి

  • కోల్‌కతాలోని శారదా పార్క్‌ వద్ద ఘోరం

  • 35 మందికిపైగా తీవ్ర గాయాలు.. భారీగా గుమిగూడిన భక్తులు

  • గాలివాన ఉధృతితోనే తొక్కిసలాట.. ప్రధాని దిగ్ర్భాంతి.. పరిహారం ప్రకటన

కోల్‌కతా, అక్టోబరు 17: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట జరిగి 17 మంది మృతి చెందారు. మరో 35 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల్లో 13 మంది మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం ఉత్తర కోల్‌కతాలోని శారదా పార్క్‌లోని ‘చోర్‌బగాన్‌ సర్బోజనిన్‌’ దుర్గాపూజ మండపం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. దుర్గా పూజ కోసం భారీగా భక్తులు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీగా గాలివాన మొదలైంది. పార్కు వద్ద మండపం బయట వేచిచూస్తున్న వారంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోయి, తొక్కిసలాటకుదారితీసింది. చాలా మంది స్పృహతప్పి పడిపోయారు. దీనితో స్థానికులు కార్లు, ద్విచక్రవాహనాలపై ఆస్పత్రులకు తరలించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఇరుకుగా ఉన్నాయని.. భారీగా వచ్చిన భక్తులను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, బాధితులకు చికిత్స అందిస్తున్నామని కోల్‌కతా పోలీసులు ప్రకటించారు. కాగా, కోల్‌కతా తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఇక బెంగాల్‌ సీఎం సువేందు అధికారి, మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా తొక్కిసలాట ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Oct 18 , 2026 | 05:53 AM