చోర్బగాన్ తొక్కిసలాటపై సిట్.. సీఎం సువేందు అధికారి వెల్లడి
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:03 PM
ఉత్తర కోల్కతాలోని చోర్బగాన్ దుర్గా పూజ మండపంలో తొక్కిసలాట జరిగి 19 మంది చనిపోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. కలకత్తా హైకోర్టు సిటింగ్ జడ్జి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర కోల్కతాలోని చోర్బగాన్ దుర్గా పూజ మండపంలో తొక్కిసలాట జరిగి 19 మంది చనిపోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. కలకత్తా హైకోర్టు సిటింగ్ జడ్జి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఉత్తరం రాస్తామని వెల్లడించారు. శనివారం చోర్బగాన్ దుర్గా పూజ మండపంలో తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడారు. హైకోర్టు నుంచి అనుమతి వచ్చాక సిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
‘తొక్కిసలాట ఘటనను నేను ప్రత్యేకంగా సమీక్షిస్తున్నాను. చీఫ్ సెక్రటరీ, పోలీసు కమిషనర్, హోం సెక్రటరీ, డీజీపీతో పాటు ఇతర అధికారులను ఎప్పటికపుడు సంప్రదించి ఆరా తీస్తున్నాను. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై చొరవ తీసుకుంటోంది. విషాదకర ఘటన నేపథ్యంలో మేం పండగను సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అలాగే, సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు చేయడం లేదు. ఆ ప్రమాదంపై నిందను వేరేవారిపై వేయం, అలా చేయాలని మీడియాకు స్టేట్మెంట్లూ ఇవ్వం’ అని సీఎం చెప్పారు.
కాగా.. అంతకుముందు తొక్కిసలాటపై అధికారులతో ముఖ్యమంత్రి సువేందు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో అలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి పరమావధి అని స్పష్టం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన 19 మందిలో 18 మంది బెంగాల్ వాసులే అని వెల్లడించారు. మృతుల అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. ఇక ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..