మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది మృతి
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:53 AM
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న శీతలా దేవి ఆలయ సమీపంలో భక్తులపైకి ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది భక్తులు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శీతలా దేవి ఆలయ సమీపంలో గుమిగూడిన భక్తులపైకి ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది భక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం రాత్రి 1:30 నిమిషాల సమయంలో జరిగిందీ దారుణ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రుల సందర్భంగా భక్తులు శీతలా దేవి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. శనివారం రాత్రి చిన్నూర్ నుంచి వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రక్కు వాలుగా ఉన్న రోడ్డును ఎక్కించబోయి అదుపుతప్పింది. సమీపంలో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో కొందరు భక్తులు అక్కడికక్కడే మరణించారు. భక్తులతో పాటు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 39 క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదంలో ఆలయ గేటు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ప్రమాదం జరిగిన దారిలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయినా ఆ ట్రక్కు పోలీసుల బారికేడ్లు, చెక్పోస్ట్లను దాటుకుంటూ వచ్చిందని గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ తెలిపారు. ఆ భారీ వాహనం పోలీస్ చెక్పోస్ట్ను ఎలా దాటగలిగింది.. అనే దానిపై దర్యాప్తు చేపట్టామని ఆమె వివరించారు. 12 మంది భక్తుల మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలూ చదవండి
దుర్గాపూజలో తొక్కిసలాట.. 17 మంది మృతి
రాత్రి నూడిల్స్ తిని.. తెల్లారేలోపు శవాలుగా..!