గీత దాటితే కఠిన చర్యలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:33 AM
‘ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షతపాతంగా నిర్వహించాలి. అందుకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహణ
నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తప్పవు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షతపాతంగా నిర్వహించాలి. అందుకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను తక్షణమే అప్రమత్తం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం.
ఇప్పటికే వారికి, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించాం. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించాం. నామినేషన్ల దాఖలు సమయంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు అనుమతించిన ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో గాని, శాంతి భద్రతల పరిరక్షణలో గాని అధికారులు నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని పునేఠా స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు నియమితులైన ఐజీ రాజకుమారి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నాం’ అని పేర్కొన్నారు.
ఘర్షణలపై అధికారులతో సమీక్ష
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసుకునేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేయకుండా తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా రాయచోటి, పులివెందుల, తిరుపతి, దర్శి, రాజంపేట, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో ఫోన్లో మాట్లాడారు. కమిషన్ కార్యదర్శి మల్లికార్జున, ఐజీ బి.రాజకుమారితో కలిసి సమీక్షించారు. ‘అభ్యర్థుల నామినేషన్ హక్కుకు ఆటంకం కలుగకుండా చూడాలి. హైకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను తక్షణమే అమర్చాలి’ అని ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ