Mamata Banerjee: ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్.. ఈసీపై మమత సంచలన ఆరోపణ
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:05 PM
ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఈసీ అన్నిరకాల తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. అర్హులైన వారిని చనిపోయినట్టుగా చూపిస్తోందని.. వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందన్నారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) మరోసారి ఎన్నికల సంఘం (EC)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం (BJP IT cell) అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్లను ఎన్నికల సంఘం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం 'తప్పుడు, రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ వ్యతిరేక' పద్ధతులను అవలంబిస్తోందన్నారు.
గంగాసాగర్ మేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ఐలాండ్‌లో మమత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఈసీ అన్నిరకాల తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని ఆరోపించారు. అర్హులైన వారిని చనిపోయినట్టుగా చూపిస్తోందని, వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణకు రావాలని బలవంతం చేస్తూ వేధిస్తోందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ సెల్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తోందని చెప్పారు. ఇది అప్రజాస్వామికమే కాకుండా రాజ్యాంగవిరుద్ధమని, ఇలా జరగడానికి వీల్లేదని అన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయం అవసరమైన వారికి అండగా నిలబడాలని కోరారు. 'నాకు సపోర్ట్ చేయమని అడగడం లేదు. ఈ ప్రక్రియ వల్ల ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్లకి సాయం చేస్తే చాలు' అని అన్నారు. కాగా, మమతా బెనర్జీ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ దురుద్దేశంతో కూడినవని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మదురోలాగే మోదీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి