Share News

UP SIR: ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:45 PM

ఉత్తరప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురించింది. యూపీ ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లులేని వారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ లో కానీ, బూత్ లెవెల్ అధికారులను సంప్రదించి కానీ.. ఫిబ్రవరి 6లోగా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని ఆ రాష్ట్ర సీఈఓ రిన్వా తెలిపారు.

UP SIR: ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
Election commission of Uttar Pradesh

లక్నో: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (Election Commission) మంగళవారం ప్రచురించింది. మొత్తం 15.44 కోట్ల ఓటర్లలో 12.55 కోట్ల (81.30 శాతం)మంది ఓటర్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో 2.17 కోట్ల మంది శాశ్వతంగా వేరేచోటికి షిఫ్ట్ అయ్యారు. 46.25 లక్షల మంది మరణించారు. డూప్లికేట్ ఐడీ కార్టులు, జాడ తెలియకుండా పోయిన కారణాలతో 24.47 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి నవదీప్ రిన్వా తెలిపారు.


ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ లో కానీ, బూత్ లెవెల్ అధికారుల(బీఎల్ఏ)ను సంప్రదించి కానీ ఫిబ్రవరి 6వ తేదీలోగా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని రిన్వా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15,000కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రతులను రాజకీయ పార్టీలకు అందజేశామని చెప్పారు.


ఎస్ఐఆర్ కింద తుది ఓటర్ల జాబితాను 2026 మార్చి 6న విడుదల చేస్తామని రిన్వా తెలిపారు. వెబ్‌సైట్‌లో EPIC నంబర్‌ను ఎంటర్ చేసి ఓటర్లు తమ వివరాలను చెక్ చేసుకోవాలని, వారి పేర్లు కనిపించకుంటే ఫారం-6ను పూర్తి చేయాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:28 PM