Former Union Minister: పెను విషాదం.. కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:22 AM
కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. పీవీ నరసింహారావు కేబినెట్‌లో రైల్వే మంత్రిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 81 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. పీవీ నరసింహారావు కేబినెట్‌లో రైల్వే మంత్రిగా సురేశ్ కల్మాడి పని చేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. సురేశ్ కల్మాడి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
ఎయిర్‌ఫోర్స్ టు రాజకీయాలు
సురేశ్ రాజకీయాల్లోకి రాకముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. 1964 నుంచి 1972 వరకు పైలట్‌గా సేవలందించారు. 1974లో రిటైర్ అయ్యారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. గత కొంత కాలంనుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో పూణెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయారు.
పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సురేశ్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి పూణె ఎంద్వాణే ఏరియాలోని కల్మాడి హౌస్‌కు తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో నవీ పేట్‌లోని వైకుంఠ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
రక్తసంబంధీకులే అంతమొందిస్తున్నారు...
ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ