Supreme Court: విధి నిర్వహణలో వైఫల్యం.. సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు అసహనం
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:14 PM
ఢిల్లీ కాలుష్య సమస్యపై లోతైన విశ్లేషణ చేయాలని, ముందుగా ప్రధాన కారణాలను గుర్తించి, ఆ తర్వాత దాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన పరిష్కరాలను కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(CAQM) 'విధి నిర్వహణలో విఫలమైంది' అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ జరిపింది.
'కాలుష్యానికి ప్రధాన కారణాలు గుర్తించారా? దీనిపై పబ్లిక్ డొమైన్‌లో చాలా ఆర్టికల్స్ వచ్చాయి. నిపుణులు తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రజలూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. మాకు ఇంకా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి' అని సుప్రీం ధర్మాననం పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి బస్సులు, ట్రక్కులు కారణమని చెప్పడం సులువేనని, అయితే వాటిని నిలిపివేస్తే ప్రజలు ఎలా ప్రయాణిస్తారని ప్రశ్నించింది.
ఈ నెల 2న సమావేశం ఏర్పాటు చేశామని, తాము తీసుకుంటున్న కీలక చర్యలపై రెండు నెలల్లో వివరాలు తెలియజేస్తామని సీఏక్యూఎం కోర్టుకు తెలియజేసింది. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది. ఇది తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, సీఏక్యూఎం తమ విధుల నిర్వహణలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య సమస్యపై లోతైన విశ్లేషణ చేయాలని, ముందుగా ప్రధాన కారణాలను గుర్తించి, ఆ తర్వాత దాన్ని ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన పరిష్కరాలను కనుగొనాలని పేర్కొంది. సీఏక్యూఎం రెండు వారాల్లోగా నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి నానాటికీ దిగజారుతున్న వాయు కాలుష్యంపై తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సమగ్ర నివేదికను ప్రజాక్షేత్రంలో ఉంచాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి