Tamilnadu Politics: డీఎంకేతో సీట్ల పంపకాల్లో పీటముడి.. విజయ్‌తో కొత్త కూటమికి కాంగ్రెస్ పావులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:02 PM
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయించేందుకు డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే 40 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కనీసం 38 సీట్లయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టినట్టు చెబుతున్నారు.
చెన్నై: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా సత్తా చాటుకుంటున్నప్పటికీ ఈసారి బీజేపీ-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రావాలనే పట్టుదలతో వ్యూహరచన సాగిస్తోంది. ఇదే సమయంలో ప్రత్నామాయ రాజకీయ పార్టీగా తెరపైకి వచ్చిన తమిళనటుడు విజయ్ టీవీకే (TVK) పార్టీ గట్టి సవాలు ఇచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఆఫర్ చేసిన సీట్లు నచ్చకపోవడంతో కాంగ్రెస్ సైతం కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తోందని తెలుస్తోంది. ఇదే సమయంలో భావజాలం ప్రకారం కాంగ్రెస్‌కు తాము అనుకూలమంటూ విజయ్ పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. దీంతో టీవీకే వైపు కాంగ్రెస్ మొగ్గుచూపే అవకాశాలున్నాయంటూ చర్చ మొదలైంది.
32 సీట్ల ఆఫర్ నచ్చని కాంగ్రెస్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయించేందుకు డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే 40 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కనీసం 38 సీట్లయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో విజయ్ టీవీకే పార్టీతో పొత్తుకు అవకాశాలు పరిశీలించాలని కూడా రాహుల్ గాంధీకి నచ్చచెప్పేందుకు తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
అధికారంలోనూ వాటా
డీఎంకే తమకు సముచిత సీట్ల కేటాయింపుతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అధికారంలో వాటా కూడా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి, పొత్తుల వ్యవహారంలో వ్యూహాత్మక పునఃసమీకరణకు కాంగ్రెస్ పావులు కదుపుతోందన్న ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు తావిస్తున్నాయని అంటున్నారు.
టీవీకే ప్రతినిధి ఏమన్నారు?
విజయ్, రాహుల్ గాంధీ మిత్రులని, కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశాలు బాగానే ఉన్నాయని టీవీకే ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ తెలిపారు. అయితే తమిళనాడు కాంగ్రెస్ నాయకుల స్వప్రయోజనాల కారణంగానే చర్చల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. కాగా, పార్టీ చీఫ్ విజయ్‌తో సంప్రదించిన తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని టీవీకే నేత నిర్మల్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు, పొత్తులపై నిర్ణయానికి చాలినంత సమయం ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి