Tamil Nadu: కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:12 PM
తమిళనాడు తమకు కీలక రాష్ట్రమని, ఇండియా కూటమి కీలకమైన కూటమి అని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఇందులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని, డీఎంకే కీలక భాగస్వామి అని చెప్పారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 'ఇండియా' (INDIA) కూటమి సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే కలిసే ఉన్నాయని, ఇరుపార్టీల మధ్య ఉన్న చిరకాల భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడులో 'ఇండియా' కూటమి భాగస్వాముల మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు.
తమిళనాడులో పొత్తుల పరిస్థితిపై బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మట్లాడుతూ, తమిళనాడు తమకు కీలక రాష్ట్రమని, ఇండియా కూటమి కీలకమైన కూటమి అని అన్నారు. ఇందులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని, డీఎంకే కీలక భాగస్వామి అని చెప్పారు. తాము కలిసికట్టుగా 8 ఎన్నికల్లో పోటీ చేశామని, కాంగ్రెస్‌కు డీఎంకే చిరకాల మిత్రపక్షమని తెలిపారు.
సీట్ల పంపకాల విషయంలో విభేదాలున్నట్టు వస్తున్న వార్తలపై మాట్లాడుతూ, పొత్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలనే విషయాన్ని తాము గుర్తించామన్నారు. సీట్ల కోసం సంప్రదింపులు సాధ్యమైనంత త్వరగా పూర్తికావాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని, ఎలాంటి జాప్యం జరిగినా పొత్తులపై అపోహలు తలెత్తే అవకాశం ఉండవచ్చని అన్నారు.
ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే బీజేపీ వ్యూహం
తమిళనాడులో బీజేపీ రాజకీయ వ్యూహంపై ఠాగూర్ విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి తమ ఉనికిని పటిష్టం చేసుకోవడమే బీజేపీ వ్యూహమని అన్నారు. ఏదోవిధంగా తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ అనుకుంటోందన్నారు. 'ముందు మీతో స్నేహం చేస్తారు. క్రమంగా మీ ఓట్లు తమవైపు తిప్పుకుంటారు. ఆ తర్వాత మీకు ఉనికి లేకుండా చేస్తారు. అన్నాడీఎంకేతో బీజేపీ ఇప్పుడు ఇదే విధానాన్ని తమిళనాడులో అనుసరిస్తోంది' అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్
వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి