Share News

ఢిల్లీలో నిరసనలు..వ్యాపార నష్టాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:16 PM

ఢిల్లీలో నిరసనలతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వర్తక సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అక్టోబర్ 10 నుంచి రూ.2,000 కోట్ల నష్టం వాటిల్లిందని పిటిషనర్లు పేర్కొన్నారు.

ఢిల్లీలో నిరసనలు..వ్యాపార నష్టాలపై సుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు
Delhi protests

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు, నిరసనల కారణంగా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీజేపీ తలపెట్టిన నిరసనల నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌ను మూసివేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఆదేశాలు జారీ చేయడం, దీనివల్ల భారీగా వ్యాపార నష్టాలు వస్తాయని ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది.


ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. వ్యాపారాలకు ఎటువంటి అక్రమ అంతరాయం కలిగినా కోర్టు జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే, ఈ తరుణంలో తక్షణ ఉత్తర్వులు జరపడానికి నిరాకరించిన కోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ చివరి వారానికి వాయిదా వేసింది. పండుగ, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారాలు మూతపడితే చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, హమాలీల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.


కన్నాట్ ప్లేస్ మార్కెట్‌లో ఒక్క రోజు నిరసనల వల్ల సుమారు రూ. 200 కోట్ల వ్యాపారం దెబ్బతింటుందని, అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు వర్తకులు రూ. 2,000 కోట్ల నష్టాన్ని చవిచూశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్తకులు ప్రధానంగా మూడు డిమాండ్లను కోర్టు ముందుంచారు:

  • అక్టోబర్ 2026 నుంచి జనవరి 2027 వరకు ప్రధాన మార్కెట్లలో రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలి.

  • నిరసనల కోసం వాణిజ్య ప్రాంతాలకు దూరంగా ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాలి.

  • నిరసన హక్కును, వ్యాపారాల హక్కులను సమతుల్యం చేసేలా ఒక ఎస్‌ఓపీని రూపొందించాలి.


మరోవైపు, వ్యాపారుల ఆందోళనలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలు నష్టపోరని, ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, రవాణాను నియంత్రించి నగరాన్ని యుద్ధభూమిలా మార్చడం వల్లే నష్టాలు వస్తున్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ, పండుగ సీజన్‌లో ఈ నిరసనల అంశం ఢిల్లీ వర్తక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

Updated Date - Oct 16 , 2026 | 03:29 PM