ఏడేళ్లుగా ఐటీలోనే.. ఇక నా వల్ల కాదు.. టెకీ పోస్టు వైరల్
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:04 PM
ఏడేళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఓ టెకీ ఈ రంగంలో ఇక కొనసాగలేనంటూ పెట్టిన పోస్టు వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏడేళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఓ టెకీ ఈ రంగంలో ఇక కొనసాగలేనంటూ పెట్టిన పోస్టు వైరల్గా మారింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నిరంతరం అప్స్కిల్లింగ్తో పాటు ఏఐతో వచ్చిన మార్పులు ఒత్తిడి పెంచేశాయని ఆ టెకీ చెప్పారు. జీవితంలో పని తప్ప ఇంకేమీ లేనట్టు మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఐటీని వదిలిపెట్టి మరేదైనా చేద్దామనుకుంటున్నా.. మీరేమంటారు? ఈ రంగంలో నాకు ఏడేళ్ల అనుభవం ఉంది. వేగంగా మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, నిరంతరం అప్స్కిల్లింగ్కు ప్రయత్నించడంతో జీవితం ఉరుకులుపరుగులుగా మారింది. దీనికి తోడు ఏఐ రాకతో పరిస్థితి మరింత మారిపోయింది. ప్రతి పనీ వేగంగా పూర్తిచేయాలన్న ఒత్తిడి పెరిగిపోయింది. వాస్తవిక డెడ్లైన్స్ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. విభజన రేఖలే లేనట్టు అయిపోయింది. అన్ని పనులూ ఒక్కరే చక్కపెట్టేయాలన్న భావన పెరిగింది’

‘ప్రతి రోజూ నిద్ర లేవగానే నాకు గుండె దడ మొదలవుతుంది. పనిని వదిలిపెట్టి ఎక్కడికైనా పారిపోతే బాగుండని అనిపిస్తుంది. మీటింగ్స్, స్క్రమ్ కాల్స్, అప్డేట్స్, డెడ్లైన్స్, స్టేటస్ కాల్స్.. ఇవన్నీ నన్ను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి. రోజుకు 9 గంటలే పనిచేయాల్సి ఉన్నా 12 గంటలు చేయాల్సి వస్తోంది’ అని అన్నారు.
‘వారాంతాలు ఒత్తిడి నుంచి కోలుకునేందుకే సరిపోతున్నాయి. సరదాగా షికార్లకు వెళ్లేందుకు మనసు రావడం లేదు. జీవితమంతా ఇలాగే గడిపేయాలని అనుకోవట్లేదు. ఊపిరాడనట్టు ఉంటోంది’ అని అతడు రాసుకొచ్చారు. టెకీ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కాలంలో ఏడేళ్లు ఐటీలో ఉండటమంటే పెద్ద విషయమేనని పలువురు అన్నారు. మరో వ్యాపారం ప్రారంభించేందుకు కావాల్సినంత సంపాదించుకుని రాజీనామా చేయాలని మరికొందరు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
టెస్లా ఫ్లయ్యింగ్ కారు.. గాల్లో పల్టీ.. సేఫ్గా ల్యాండింగ్
వర్చువల్ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్