Share News

టెస్లా ఫ్లయ్యింగ్ కారు.. గాల్లో పల్టీ.. సేఫ్‌గా ల్యాండింగ్

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:03 AM

గాల్లో పల్టీ కొట్టి మరీ సేఫ్‌గా ల్యాండ్ కాగలిగే రోడ్‌స్టర్‌ కారును టెస్లా తాజాగా ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

టెస్లా ఫ్లయ్యింగ్ కారు.. గాల్లో పల్టీ.. సేఫ్‌గా ల్యాండింగ్
Tesla Roadster

ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్తులో ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయని టెస్లా, స్పేస్ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ దిశగా తన వంతు ప్రయత్నాలను కొన్నేళ్ల క్రితమే మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల తొలి ఫలితం తాజాగా ఆవిష్కృతమైంది. గాల్లో పల్టీ కొట్టి మరీ సేఫ్‌గా ల్యాండ్ కాగలిగే రోడ్‌స్టర్‌ కారును టెస్లా తాజాగా ప్రదర్శించింది. టెక్సాస్‌లోని వాకోలో ఈ కారు సామర్థ్యాలను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ ఫెసిలిటీలో ఈ కారును ఆవిష్కరించారు. కారు సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఓ వంపు తిరిగిన ర్యాంపును ఏర్పాటు చేశారు. ప్రదర్శన సమయంలో కారు ర్యాంపుపై తొలుత సాధారణంగా ప్రయాణించి, నిటారుగా ఎగబాకుతూ, చివరకు తలకిందులుగా ప్రయాణించి ర్యాంపు దాటి గాల్లోకి దూసుకెళ్లింది. ఆపై గాల్లోనే పల్టీకొట్టి స్థిరంగా నేలమీదకు దిగింది. కారులో అమర్చిన కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లు ఇందుకు ఉపయోగపడ్డాయి. స్పేస్ ఎక్స్ సంస్థనే వీటిని సరఫరా చేసింది. ఈ థ్రస్టర్ల సాయంతోనే కారు సేఫ్‌గా ల్యాండైంది.


అయితే, ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మక దశలోనే ఉందని టెస్లా ఇప్పటికే స్పష్టం చేసింది. సాధారణ రోడ్లపై వినియోగించేందుకు అనుమతి లేదని పేర్కొంది. ఏడేళ్ల క్రితమే ఎగిరే కాన్సెప్ట్ కార్ల గురించి మస్క్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అన్నట్టుగానే నేడు ఆ కారును ప్రపంచం ముందుకు తెచ్చారు. అయితే, భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఈ కారుతో ఆవిషృతం కావడంతో అనేక మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. అటు ఏఐ, ఇటు రోబోటిక్స్, మరోవైపు ఫ్లయ్యింగ్ కార్స్.. ఇలా సినిమాల్లో చూసిన దృశ్యాలు త్వరలో నిజరూపం దాల్చనున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

ఆరు భటూరాల్లో.. గ్లాసు నిండా నూనె! వీడియో వైరల్

Updated Date - Oct 16 , 2026 | 12:05 PM