ఢిల్లీలో రూ.5.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - May 16 , 2026 | 08:31 PM
ఢిల్లీలో మరోసారి భారీ బంగారం స్కామ్ బయటపడింది. ఓ వ్యక్తి ప్యాంట్ జేబుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడున్నర కిలోల పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అక్రమ బంగారం గుట్టురట్టయింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ బంగారం స్మగ్లింగ్ యత్నాలను భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. పక్కా సమాచారంతో నిఘాపెట్టిన కస్టమ్స్ విభాగం అధికారులు.. అమెరికా నుంచి వచ్చిన ఓ భారత సంతతి వ్యక్తి వద్ద నుంచి రూ.5.5 కోట్ల విలువైన పసిడిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా విమానాశ్రయం నుంచి బయటపడేందుకు యత్నించాడు. అయితే.. అంతర్జాతీయ స్మగ్లర్లు భారీగా బంగారాన్ని భారత్‌కు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అధికారులు అప్పటికే అలర్ట్ అయ్యారు. సదరు ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ బృందం అతడిని అడ్డుకుని విచారించింది. అతడిని, లగేజీని తనిఖీ చేయగా.. అసలు విషయం వెలుగుచూసింది. అతను ధరించిన ప్రత్యేక బెల్టుతో పాటు ప్యాంటు జేబుల్లో అత్యంత చాకచక్యంగా దాచిన 115 బంగారు బిస్కెట్లను(24 క్యారెట్లు) అధికారులు గుర్తించారు. ఇవి మొత్తం సుమారు 3.5 కిలోల బరువు ఉంటాయని, వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.5.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. ప్రస్తుతం అతని కాల్ డేటా, ప్రయాణ వివరాలు, ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి రవాణాదారు మాత్రమేనని.. దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్ హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో స్మగ్లింగ్ కేసులు ఎక్కువయ్యాయని.. అందుకే ఎయిర్‌పోర్టుల్లో అత్యాధునిక స్క్రీనింగ్ టెక్నాలజీ, రిస్క్ ప్రొఫైలింగ్ ద్వారా నిఘాను మరింత తీవ్రం చేసినట్లు వెల్లడించారు కస్టమ్స్ అధికారులు.
ఇవీ చదవండి:
'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో పూర్తిగా బంద్.. వైరల్ ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ..