'నీట్' పేపర్ లీక్ ఎఫెక్ట్.. ఎన్‌టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
ABN , Publish Date - May 16 , 2026 | 05:01 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్‌టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA).. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలలో ప్రవేశాలు, ఫెలోషిప్‌ల కోసం అర్హత పరీక్షలను నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ స్వతంత్ర, స్వయంప్రతిపత్తి కలిగిన పరీక్షా సంస్థ. అయితే 2026లో నీట్ పేపర్ సహా గతంలోనూ పలు ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో.. ఇప్పుడు ఆ సంస్థ ఉనికి ప్రమాదంలో పడేలా ఉంది. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడమే ఇందుకు కారణం. వివరాల్లోకెళితే...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్‌టీఏను పూర్తిగా రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం, 1860 కింద సేవలందిస్తున్న ఎన్‌టీఏ స్థానంలో పార్లమెంట్ చట్టం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన స్వతంత్ర జాతీయ పరీక్షా సంస్థను ఏర్పాటుచేయాలని పిటిషన్‌లో కోరింది.
ఆర్టికల్-32 కింద దాఖలైన ఈ పిటిషన్‌లో నీట్-యూజీ 2026 నిర్వహణలో వ్యవస్థాగత లోపాలు చోటుచేసుకున్నాయని డాక్టర్స్ ఫ్రంట్ ఆరోపించింది. ప్రశ్నపత్రం లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిష్పక్షపాతంపై నమ్మకం దెబ్బతిందని పేర్కొంది. ఇప్పటికే ఈ పరీక్ష రద్దుకావడం, మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించడంతో ఎన్‌టీఏ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవకాశాన్ని దుర్వినియోగం చేసి..
ఇక.. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఇప్పటికే కీలక పురోగతి సాధించింది. పుణేకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ.కులకర్ణిని ప్రధాన సూత్రధారిగా గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌టీఏ తరఫున పరీక్షా ప్రక్రియలో భాగస్వామిగా పనిచేసిన కులకర్ణికి ప్రశ్నపత్రాలపై మంచి అవగాహన ఉందని సీబీఐ తెలిపింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసి, ఏప్రిల్ చివరి వారంలో తన ఇంట్లో ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించి విద్యార్థులకు ప్రశ్నలు, జవాబులు చెప్పినట్లు ఆరోపించింది. ఈ తరగతులకు హాజరైన విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించినట్లు దర్యాప్తులో బయటపడింది. వారు నోటుబుక్స్‌లో రాసుకున్న ప్రశ్నలు, నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో పూర్తిగా సరిపోలాయని సీబీఐ తేల్చింది. ఇప్పటికే మధ్యవర్తులుగా వ్యవహరించిన పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. ఈ ఘటన దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఎన్‌టీఏ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి:
దారుణం.. ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి అనుమతి..
లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు