లోక్‌సభ ఎన్నికల్లో వివాదాస్పద ప్రసంగం.. అజాంఖాన్‌కు రెండేళ్ల జైలు
ABN , Publish Date - May 16 , 2026 | 03:12 PM
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ (Azam Khan) తిరిగి లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద ప్రకటనకు సంబంధించి ఆయనకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారంనాడు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ (Azam Khan) తిరిగి లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారంనాడు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనితో పాటు రూ.5,000 జరిమానా కూడా విధించింది. గత కొన్నేళ్లుగా వరుసగా పలు లీగల్ చిక్కులు ఎదుర్కొంటున్న అజాంఖాన్‌కు మరోసారి ఈ తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది.
కేసు పూర్వాపరాలు
అజాంఖాన్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో జిల్లా యంత్రాంగం అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు సంచలనం కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 'స్థిరంగా నిలబడండి. ఈ కలెక్టర్లు, అధికారులకు భయపడవద్దు. వాళ్లు జీతం తీసుకునే ఉద్యోగులు. వాళ్లకు మనం భయపడాల్సిన పనిలేదు. మీరు మాయావతి ఫొటోలు చూసే అంటారు. సీనియర్ అధికారులు ఆమె బూట్లను చేతిరుమాళ్లతో తుడిచారు. మనం ఆమెతో పొత్తు పెట్టుకున్నాం. అల్లా తలిస్తే ఈ ఆఫీసర్లతో కూడా ఆమె బూట్లు పాలిష్ చేయిస్తా' అని ఎన్నికల ర్యాలీలో అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిచేలా ఉన్నాయంటూ ఫిర్యాదు నమోదైంది. దానిపై ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు విచారణ జరిపి తాజాగా తీర్పునిచ్చింది. అజాంఖాన్ ప్రస్తుతం రాంపూర్ జైలులో ఉన్నారు.
అజాంఖాన్‌కు లీగల్‌గా దెబ్బతగలడం ఇదే మొదటిసారి కాదు. 2026 ఏప్రిల్‌లో అజాంఖాన్, ఆయన కుమార్ అబ్దుల్లా అజాంఖాన్ దాఖలు చేసిన అప్పీల్‌ను రాంపూర్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2019లో తండ్రీకొడుకులు రెండు వేర్వేరు పాన్ కార్డులు కలిగి ఉన్నారనే కేసులో వారిని దోషులుగా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నిర్ధారించింది. 2025లో తీర్పు ప్రకటిస్తూ ఇద్దరికీ చెరో ఏడేళ్లు జైలుశిక్ష విధించింది. జరిమానా కూడా వేసింది.
ఇవి కూడా చదవండి..
మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్