మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్
ABN , Publish Date - May 16 , 2026 | 02:42 PM
కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గం ఏర్పాటుపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఈనెల 17వ తేదీ ఆదివారంనాడు మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తామని ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్టు వీడీ సతీశన్ తెలిపారు. 18న తనతో పాటు మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తిరువనంతపురం: కేరళంలో యూడీఎఫ్ (UDF) ప్రభుత్వం కొలువు తీరేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గం ఏర్పాటుపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఈనెల 17వ తేదీ ఆదివారంనాడు మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తామని ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్టు వీడీ సతీశన్ (VD Satheesan) తెలిపారు. మే 18న తనతో పాటు మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) నేతలతో శనివారంనాడు సమావేశానంతరం మీడియాతో సతీశన్ మాట్లాడుతూ, రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలుచేసినా సెక్యులర్ విధానాన్ని కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు సతీశన్ చెప్పారు. 'కేరళంలో కొన్ని శక్తులు విద్వేష ప్రచారం సాగిస్తున్నాయి.కానీ ముస్లిం లీగ్, వారి నేత పనక్కాడ్ సైయిద్ సాదిఖ్ అలి బలమైన సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్నారు. యూడీఎఫ్ కూడా సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం' అని వివరించారు.
ఎన్నికల ప్రచారంలో ఐయూఎంఎల్‌తో యూడీఎఫ్ పొత్తును బీజేపీ, సీపీఎం లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశాయని, కానీ ప్రజలు ఆ ఆరోపణలను తిప్పికొట్టి 102 సీట్లలో తమను గెలిపించారని సతీశన్ చెప్పారు. కాగా, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల నివాసానికి వెళ్లి సతీశన్ కలుసుకున్నారు. మంత్రివర్గం కూర్పు, శాఖలపై ఆయనతో చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్‍డీఎఫ్‌పై యూడీఎఫ్ విజయం సాధించింది. 140 స్థానాల్ల 102 సీట్లు గెలుచుకుంది. 2021 నుంచి విపక్ష నేతగా సతీశన్ వ్యవహరిస్తూ ఎల్‌డీఎఫ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో ఆయనను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్
రాబర్ట్ వాద్రాకు ఊరట.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు బెయిల్