Share News

ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - May 16 , 2026 | 07:54 AM

విదేశీ యానంపై భారత్ తాత్కాలిక పన్ను విధించనుందంటూ వచ్చిన వార్తలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. ఆ వార్తలో నిజమే లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ
PM Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పర్యటనలపై కూడా కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జ్ విధించేందుకు యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ కథనంలో నిజమనేదే లేదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి మారకం విలువ అంతకంతకూ పతనం అవుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం విదేశీ పర్యటనలపై తాత్కాలికంగా పన్ను విధించేందుకు యోచిస్తోందని సీఎన్‌బీసీ-టీవీ18 ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనంపై ప్రధాని ఘాటుగా స్పందించారు.

‘ఇది పూర్తిగా అసత్యం. ఈ కథనంలో వాస్తవమనేదే లేదు. విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధించే ప్రశ్నే లేదు. వ్యాపార నిర్వహణ, ప్రజల జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు.


ప్రధాని పోస్టు తరువాత ఆ వార్తా ఛానల్ కూడా తన కథనాన్ని ఉపసంహరించుకుంది. తమ కథనంలో కచ్చితత్వం లోపించిందని అంగీకరించింది. ఈ తప్పిదానికి విచారం వ్యక్తం చేస్తున్నామంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.


దేశంలో ఇంధన రంగంలో గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని శుక్రవారం యూఏఈలో పర్యటించారు. భారత్‌లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి యూఏఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశీయ ఇంధన రంగ భద్రత, ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ దిశగా ఈ ఒప్పందం కుదిరింది.


ఈ వార్తలనూ చదవండి:

2025లోనూ నీట్‌ లీక్‌?

బెంగాల్‌లో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌

Updated Date - May 16 , 2026 | 08:12 AM