Share News

2025లోనూ నీట్‌ లీక్‌?

ABN , Publish Date - May 16 , 2026 | 04:13 AM

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన ‘నీట్‌’ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీకైందా? లీకైన పేపర్‌ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్‌ లీకేజీపై ......

2025లోనూ నీట్‌ లీక్‌?

  • నిందితుడు మంగీలాల్‌ కుటుంబంలో ఐదుగురికి గత ఏడాది నీట్‌లో మంచి మార్కులు

  • యావరేజ్‌ రికార్డు ఉన్నవారికి కూడా ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు

  • ప్రశ్నపత్రం లీకవడమే కారణమనే సందేహాలు

  • ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి నీట్‌ కమిటీ సభ్యుడే

  • పుణేలో కులకర్ణిని అరెస్టు చేసిన సీబీఐ అధికార్లు

  • నీట్‌ రద్దుతో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

  • మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు

  • ఆ విద్యార్థులవి ఆత్మహత్యలు కావు.. హత్యలు

  • బాధ్యుల్ని వదలం.. ఇది నా వాగ్దానం: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 15: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన ‘నీట్‌’ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీకైందా? లీకైన పేపర్‌ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్‌ లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు గుర్తించిన పలు అంశాలు ఈ సందేహాలు లేవనెత్తుతున్నాయి. ప్రస్తుత లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న మంగీలాల్‌ బివాల్‌, దినేశ్‌ బివాల్‌ కుటుంబంలోని ఐదుగురికి నీట్‌-2025లో మంచి మార్కులు వచ్చి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. ఆ ఐదుగురిలో నలుగురు సాధారణ విద్యార్థులేనని, వారికి పదో తరగతి, ఇంటర్‌లలో సగటు మార్కులే వచ్చాయని తేల్చారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దినేశ్‌ బివాల్‌ స్థానిక బీజేపీ నాయకుడు. ఆయన సోదరులు మంగీలాల్‌, ఘన్‌శ్యామ్‌. గత ఏడాది (2025) నీట్‌లో ఈ కుటుంబానికి చెందిన వికాస్‌ బివాల్‌, ప్రగతి, గుంజన్‌, సానియా, పలక్‌ ఐదుగురూ మంచి మార్కులు సాధించారు. ఒకే కుటుంబంలో ఇంత మంది ప్రభుత్వ మెడికల్‌ సీట్లు సాధించడంపై అభినందనలు వెల్లువెత్తాయి. కానీ తాజాగా నీట్‌ లీకేజీ కేసులో మంగీలాల్‌, దినేశ్‌ అరెస్టవడం కలకలం రేపుతోంది. వికాస్‌కు టెన్త్‌లో 63శాతం, ఇంటర్‌లో 55శాతమే మార్కులు వచ్చాయి. 2024 నీట్‌లో మొత్తం 720 మార్కులకుగాను 270 మాత్రమే వచ్చాయి. కానీ 2025 నీట్‌లో 85.1శాతం పర్సంటైల్‌ సాధించాడు. అతడి సోదరి ప్రగతి టెన్త్‌లో (69శాతం), ఇంటర్‌లో (91శాతం) మార్కులు సాధించినా 2024 నీట్‌లో 332 మార్కులే వచ్చాయి. కానీ 2025 నీట్‌లో 89 పర్సంటైల్‌ సాధించింది. 2024 నీట్‌లో దినేశ్‌ బవాల్‌ కుమార్తె గుంజన్‌ 355, మరో సోదరుడి కుమార్తెలు సానియాకు 360, పలక్‌కు 512 మార్కులే రాగా.. 2025 నీట్‌లో సానియా 94, పలక్‌ 98.6 పర్సంటైల్‌ సాధించారు. తాజాగా మంగీలాల్‌ తన చిన్నకుమారుడు రిషి కోసం నీట్‌ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. అయితే 2025లోనూ నీట్‌ లీకై ఉంటుందన్న అనుమానాలను ఎన్‌టీఏ వర్గాలు ఖండిస్తున్నాయి.


2024, 25 నీట్‌ పరీక్షలపైనా దర్యాప్తు చేయాలి: కాంగ్రెస్‌

నీట్‌ పేపర్‌ లీకేజీ వెనుక వ్యవస్థీకృత రాకెట్‌ ఉందని, 2024, 2025లలో కూడా నీట్‌ లీకైందని.. దీనంతటిపైనా విచారణ చేపట్టాలని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోతాస్ర డిమాండ్‌ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దినేశ్‌ బివాల్‌ బీజేపీ నేత అని, అతడితోపాటు ఈ స్కాం సూత్రధారులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దినేశ్‌ కుటుంబానికి చెందిన ఐదుగురు 2024లో నీట్‌ రాసినా పెద్దగా మార్కులు తెచ్చుకోలేకపోయారని.. కానీ 2025లో ఏకంగా మెరిట్‌ మార్కులు తెచ్చుకుని ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు సంపాదించారని పేర్కొన్నారు.

2024లోనూ కలకలం

2024లోనూ నీట్‌ లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. పరీక్ష తేదీకి ముందురోజు రాత్రి జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నీట్‌ సెంటర్‌గా ఉన్న ఒక పాఠశాల నుంచి ప్రశ్నపత్రం లీకైంది. పెద్ద కాలేజీలకు చెందిన పలువురు విద్యార్థులను ఒక అతిథి గృహంలో ఉంచి రాత్రికి రాత్రే ప్రశ్నలు, సమాధానాలను ప్రాక్టీసు చేయించారు. ఈ విషయం లీకవడంతో విద్యార్థులు నిరసనలకు దిగారు. కేసు నమోదు చేసిన సీబీఐ 45 మందిని అరెస్టు చేసింది. 144 మంది విద్యార్థులు లీకైన ప్రశ్నపత్రంతో ప్రాక్టీసు చేసి పరీక్ష రాసినట్టు గుర్తించింది. ప్రభుత్వం ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించింది.


లీకేజీ సూత్రధారి నీట్‌ కమిటీ సభ్యుడే!

నీట్‌-2026 ప్రశ్నపత్రం లీకేజీ సూత్రధారి పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు శుక్రవారం పుణెలో అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పీవీ కులకర్ణి స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో రసాయనశాస్త్రం లెక్చరర్‌గా పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరయ్యారు. కొన్నేళ్లుగా నీట్‌ ప్రశ్నపత్రం రూపకల్పన కమిటీలో రసాయనశాస్త్రానికి సంబంధించి సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీనితో ఆయనకు నీట్‌ ప్రశ్నపత్రం అందుబాటులో ఉంది. కులకర్ణిని సీబీఐ అధికారులు బుధవారమే అదుపులోకి తీసుకున్నారు. లోతుగా విచారణ జరిపి లీకేజీ వ్యవహారంలో ఎవరెవరికి పాత్ర ఉందనే వివరాలు ఆరా తీశారు. లాతూర్‌ కేంద్రంగానే లీకేజీ వ్యవహారం నడిచిందని, లీకేజీ సూత్రధారి కులకర్ణి అని తేల్చి శుక్రవారం అరెస్టు చేశారు. కులకర్ణి తన నివాసంలో కొందరు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు తీసుకుని ప్రత్యేకంగా కోచింగ్‌ క్లాసులు నిర్వహించారని.. నీట్‌ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు, జవాబులపై ప్రాక్టీసు చేయించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. మనీషా వాఘ్మరే అనే మహిళ సాయంతో తన ప్రత్యేక కోచింగ్‌ క్లాసులకు విద్యార్థులను సమీకరించారని చెప్పారు. సదరు విద్యార్థుల నోట్‌ పుస్తకాల్లో రాసుకున్న ప్రశ్నల్లో చాలా వరకు నీట్‌ ప్రశ్నపత్రంతో సరిపోలాయని తెలిపారు. లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యేక కోచింగ్‌ క్లాసులకు హాజరైన విద్యార్థులు, వారిని కులకర్ణి వద్దకు తీసుకువచ్చిన మధ్యవర్తులను గుర్తించామని వెల్లడించారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి.. నీట్‌ లీకేజీతో సంబంధమున్న పత్రాలు, ఫోన్లు, ఎలక్ట్రిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిని ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపామని వివరించారు. కులకర్ణి నుంచి ప్రశ్నపత్రం పొందిన మనీషా వాఘ్మరే దానిని శుభం ఖైర్నార్‌కు ఇచ్చారని, ఆయన నుంచి యశ్‌ యాదవ్‌కు ప్రశ్నపత్రం చేరిందని అధికారులు తెలిపారు. యశ్‌యాదవ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, జైపూర్‌కు చెందిన మంగీలాల్‌ బివాల్‌ ప్రశ్నపత్రాన్ని సంపాదించారని.. తన చిన్న కుమారుడు రిషికి, ఇతర బంధువుల పిల్లలకు దాన్ని అందజేశారని వెల్లడించారు.


మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య!

నీట్‌ రద్దుతో ఆందోళన చెంది మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని సికార్‌లో ప్రదీప్‌ మేఘ్వాల్‌ అనే విద్యార్థి శుక్రవారం ఉరి వేసుకున్నారు. అక్కడి ఝున్‌ఝును జిల్లాలోని కనికాకి ధనీ గ్రామానికి చెందిన ప్రదీప్‌ తన ఇద్దరు అక్కాచెల్లెళ్లతో కలిసి సికార్‌లోని ఒక గదిలో అద్దెకు ఉంటూ నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఈసారి పరీక్ష బాగా రాశానని, 650కిపైగా మార్కులు వస్తాయని చెప్పాడని ప్రదీప్‌ తండ్రి రాజేశ్‌కుమార్‌ చెప్పారు. కానీ నీట్‌ రద్దు కావడంతో ఆవేదనకు లోనై ప్రాణాలు తీసుకున్నారని వాపోయారు. ఇక ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ ప్రాంతంలో 20 ఏళ్ల యువతి గురువారం సాయంత్రం తమ ఇంట్లోనే ఉరివేసుకున్నారు. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్‌ రద్దుతో ఆమె తీవ్రంగా ఆందోళనకు గురైందని, ఆ బాధతోనే ఉరివేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

నీట్‌ను రాష్ట్రాలకు అప్పగించండి: ఐఎంఏ

నీట్‌ పరీక్షలో అక్రమాల అంశంపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పారదర్శకత, విశ్వాసాన్ని పెంచడానికి నీట్‌ పరీక్ష నిర్వహణనను వికేంద్రీకరించి, రాష్ట్రాలకు బాధ్యత అప్పగించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాసింది. నీట్‌-2026కు దేశవ్యాప్తంగా 22.5 లక్షల మంది హాజరయ్యారని.. 551 నగరాల్లో 5,500 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారని గుర్తు చేసింది. ఇంత భారీ పరీక్షను రాతపూర్వక విధానంలో కొనసాగించడం అక్రమాలకు మార్గం సులువు చేస్తోందని పేర్కొంది.

Updated Date - May 16 , 2026 | 04:13 AM