మరోసారి పెట్రోల్ ధర పెంపు? రూ.10 వరకూ పెంచే ఛాన్స్..
ABN , Publish Date - May 16 , 2026 | 01:57 PM
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో మరో రూ.10ల మేర ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకతప్పదా? అంటే అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. ఆయిల్ మార్కెటింగ్ సంస్థల నష్టాలను తగ్గించేందుకు ధరలను మరో రూ.10ల మేర పెంచాల్సి రావొచ్చని అంటున్నారు. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ ఎమ్‌కే గ్లోబల్ ఒక నివేదికను విడుదల చేసింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశీయంగా కూడా ధరలు పెంచకపోతే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలు మరింత పెరుగుతాయని ఎమ్‌కే గ్లోబల్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను సగటున రూ.3 మేర పెంచింది. అంతకుముందే ప్రభుత్వం ఇంధనాలపై ఎక్సైజ్ డ్యూటీలో లీటరుకు రూ.10ల మేర కోత పెట్టింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను సగానికైనా తగ్గించుకునేందుకు వచ్చే రెండు మూడు వారాల్లో ధరలను లీటరుకు రూ.10 చొప్పున పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక్కసారిగా లేక విడతల వారీగా ఇంధన ధరలు రాబోయే రోజుల్లో పెరగవచ్చని తన నివేదికలో అంచనా వేసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్ల మేర పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం 0.3 శాతం మేర పెరుగుతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కరెంట్ అకౌంట్ లోటు కూడా 0.3 శాతం మేర పెరుగుతుందని అంటున్నారు. ముడి చమురు ధరల్లో పెరుగుదల కారణంగా ఇప్పటికే జీడీపీ కుదింపునకు సంబంధించిన అంచనాలు కూడా వెలువడటం మొదలైందని చెబుతున్నారు. ఇక దేశీయంగా ఇంధన ధరలు 3 నుంచి 5 శాతం మేర పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం 0.15-0.25 శాతం మధ్య పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్
రాబర్ట్ వాద్రాకు ఊరట.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు బెయిల్