విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్
ABN , Publish Date - May 16 , 2026 | 12:58 PM
లఖ్‌నవూ యూనివర్సిటీలో విద్యార్థినుల రక్షణ, పరీక్షల పారదర్శకతను ప్రశ్నించేలా ఒక దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేస్తానని ఆశ చూపిస్తూ, ఒక విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఉత్తరప్రదేశ్, మే16: విద్యార్థులను మంచి దేశ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులు కీలక పాత్ర పోషిస్తుంటారు. యువతకు విద్యాబోధనలు చేస్తూ వారి ఉన్నతికి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు తోడ్పడుతుంటారు. అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం ఉంటుంది. అయితే నేటికాలంలో కొందరు మాత్రం ఉపాధ్యాయ వృతికి అపకీర్తి తెస్తున్నారు. బిడ్డలాంటి తమ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి కీచక గురువులకు పోలీసులు బుద్ధి చెప్తున్నా.. ఇంకా పుట్టుకొస్తున్నారు. తాజాగా లఖ్‌నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్ కీచక బుద్ధి వెలుగులోకి వచ్చింది.
లఖ్‌నవూ యూనివర్సిటీలో పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేస్తానని ఆశ చూపిస్తూ, ఒక విద్యార్థిని పట్ల జువాలజీ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హసన్‌గంజ్ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూనివర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నిందితుడైన ప్రొఫెసర్ పరంజీత్ సింగ్ ఒక విద్యార్థినితో అత్యంత అసభ్యకరంగా మాట్లాడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సదరు విద్యార్థినికి అకడమిక్ బెనిఫిట్స్ కల్పిస్తానని నమ్మిస్తూ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన మూడు ఆడియో రికార్డింగ్‌లను ఆ బాధితురాలు యూనివర్సిటీ యాజమాన్యానికి సమర్పించింది. ఆ ఆడియో క్లిప్‌లలో ప్రొఫెసర్ పరంజీత్ సదరు విద్యార్థినిని.. డార్లింగ్ అంటూ సంబోధిస్తూ తన ఆఫీస్ రూమ్‌కు రమ్మని పిలవడం, పరీక్షల ప్రశ్నపత్రాలను ముందే ఇస్తానని ఆశ చూపడం స్పష్టంగా వినిపిస్తోంది. వారానికి ఒకసారి తనను కలవాలని, అలా చేస్తే పరీక్షల్లో పూర్తి సహాయం చేస్తానని అతను ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ప్రొఫెసర్ ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. యూపీ ప్రభుత్వం పరీక్షల సమగ్రత, లైంగిక వేధింపులకు సంబంధించిన కఠిన నిబంధనలను అమలు చేసి, నిందితుడైన ప్రొఫెసర్‌ను అరెస్టు చేయాలని ఏబీవీపీ లఖ్‌నవూ విశ్వవిద్యాలయ యూనిట్ అధ్యక్షుడు జై శ్రీవాస్తవ అన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యకలాపాన్నైనా అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని యూనివర్సిటీ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. 24 గంటల్లోగా తన విచారణ నివేదికను సమర్పించాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జెపి సైని అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
రాబర్ట్ వాద్రాకు ఊరట.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు బెయిల్
బెంగాల్‌లో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్