Share News

నేడు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?

ABN , Publish Date - May 16 , 2026 | 11:09 AM

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు ఇవాళ సమ్మెకు దిగనున్నారు. ఇంధన ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఐదు గంటల సమ్మెను ప్రకటించింది.

నేడు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?
Gig workers strike

ఇంటర్నెట్ డెస్క్: స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు ఇవాళ(శనివారం) సమ్మెకు దిగనున్నారు. ఇంధన ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) నేడు ఐదు గంటల సమ్మెను ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12: 00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు గిగ్ వర్కర్లు తమ యాప్‌లను ఆఫ్‌లైన్‌లో ఉంచుతారు. పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా ఆదాయం పడిపోవడంతో, కనీస డెలివరీ రేటును కిలోమీటర్‌కు రూ.20 వరకు పెంచాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు.


గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసే వారికి అసౌకర్యం కలగనుంది. అలానే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ , జెప్టో వంటి ఆన్‌లైన్ డెలివరీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం, ప్రధాన ఆన్‌లైన్ సంస్థలు రెండూ కిలోమీటరుకు సర్వీస్ రేట్లను తక్షణమే పెంచాలని జీఐపీఎస్‌డబ్ల్యూయూ డిమాండ్ చేసింది. పెరిగిన ఇంధన ధరలు తమను మరింత ఆర్థిక ఒత్తిడిలోకి నెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.


రోజువారీ ఆదాయం కోసం మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై ఆధారపడే దాదాపు 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్లపై ఇంధన ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతుందని యూనియన్ తెలిపింది. పెరుగుతున్న ఇంధన, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా గిగ్ వర్కర్ల సంపాదన పెరగకపోతే, తాము ఈ రంగాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని హెచ్చరించారు. సవరించిన డెలివరీ రేట్లు, ఇంధన నష్టపరిహారం కోరుతూ ప్రభుత్వానికి, ఆన్‌లైన్ డెలివరీ సంస్థలకు వినతిపత్రాలు సమర్పించినట్లు జీఐపీఎస్‌డబ్ల్యూయూ తెలిపింది. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి వెళ్లేందుకు తాము నేడు శాంతియుత సమ్మెకు దిగినట్లు గిగ్ వర్కర్ల యూనియన్ పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

2025లోనూ నీట్‌ లీక్‌?

బెంగాల్‌లో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌

Updated Date - May 16 , 2026 | 11:13 AM