పార్టీ వద్దనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు... మమతా బెనర్జీ
ABN , Publish Date - May 16 , 2026 | 04:49 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని చవిచూడటంతో పార్టీని కొత్తగా నిర్మించాలని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉండవచ్చని, వద్దనుకునే వాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓటమిని చవిచూడటంతో పార్టీని కొత్తగా నిర్మించాలని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నిర్ణయించుకున్నారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉండవచ్చని, వద్దనుకునే వాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కాళీఘాట్ నివాసంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసినా తిరిగి పుంజుకుంటుందని మమతా బెనర్జీ ఈ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేసారు.
'పార్టీని వీడి వెళ్లాలనుకునే వారు వెళ్లొచ్చు. నేను పార్టీని కొత్తగా నిర్మిస్తాను. పార్టీతోనే ఉండాలనుకునే వారు దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను పునర్నిర్మించండి. రంగులు వేసి తిరిగి ప్రారంభించండి. నేను కూడా పార్టీ కార్యాలయాలకు రంగలు వేస్తాను. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నటికీ తలవంచేది లేదు. ప్రజాతీర్పును దొంగిలించారు' అని మమతా బెనర్జీ ఈ సమావేశంలో పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ స్థాయి నుంచి విపక్ష పార్టీ స్థాయికి టీఎంసీ పడిపోయింది. 294 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 80 స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. మమతా బెనర్జీ సైతం తనకు కంచుకోట అయిన భవానీపూర్ నుంచి ఓటమిని చవిచూశారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయని, పలువురు నాయకులు ఫిరాయింపులకు పాల్పడే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మే 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మమతా బెనర్జీ కొందరు నాయకులు ఫిరాయింపులకు పాల్పడే అవకాశాలున్న విషయం తనకు తెలుసునని అన్నారు. 'వాళ్లకున్న అనివార్యతలు వారికి ఉండచ్చు. దాని గురించి నేను మాట్లాడను. ఎవరైతే వెళ్లిపోవాలనుకుంటారో వాళ్లు వెళ్లిపోవచ్చు. ఎవర్నీ బలవంతంగా ఒప్పించి వెనక్కి తీసుకురాలేము' అని అన్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఓటమితో ఎవరూ నిరాశచెందవద్దనే సంకేతాలిస్తూ అభ్యర్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు మమతా బెనర్జీ తాజా సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
కోట్లాది మంది భారతీయుల నమ్మకం నన్ను అలసిపోనివ్వదు: ప్రధాని మోదీ..
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్