కోట్లాది మంది భారతీయుల నమ్మకం నన్ను అలసిపోనివ్వదు: ప్రధాని మోదీ..
ABN , Publish Date - May 16 , 2026 | 03:02 PM
భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులను కలిశారు.
ఢిల్లీ: భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని.. ప్రస్తుతం అవి 100కు చేరాయన్నారు. సెమీకండక్టర్ల అంశంలోనూ భారత్ ముందడుగు వేసిందని.. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులను కలిశారు. వారితో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలపై ప్రశంసలు కురిపించారు. లక్ష్యాలను అధిగమించి వారు పని చేస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 'ఇంతటి ప్రేమ, ఉత్సాహాన్ని చూసి నెదర్లాండ్స్‌లో ఉన్నానన్న సంగతి ఒక్క క్షణం మర్చిపోయాను. భారతదేశంలోనే ఓ ఉత్సవానికి హాజరైనట్లు అనిపించింది. భారత స్నేహానికి ది హేగ్ సజీవ చిహ్నంగా మారిందని అనిపిస్తోంది. నేను నెదర్లాండ్స్ నాయకత్వంతో మాట్లాడిన ప్రతిసారీ వారు ప్రవాస భారతీయులను ప్రశంసిస్తూనే ఉంటారు. నెదర్లాండ్స్ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మీరు చేసిన సేవకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. మీ పూర్వీకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను వదిలేశారు. కానీ కొన్ని విషయాలు ఎల్లప్పుడూ మీతోనే ఉండిపోయాయి. భారతదేశ మట్టి పరిమళం, పండుగల జ్ఞాపకాలు, భక్తి గీతాల రాగాలు, పూర్వీకులు అందించిన విలువలు మీతో ఉన్నాయి.
కాలక్రమేణా ఎన్నో సంస్కృతులు కనుమరుగయ్యాయనే వాస్తవానికి మానవ చరిత్రే సాక్ష్యం. కానీ భారతదేశ విభిన్న సంస్కృతి ఇప్పటికీ మన ప్రజల హృదయాల్లో బలంగా ఉంది. తరాలు మారాయి, దేశాలు మారాయి, పరిసరాలు మారాయి, కానీ కుటుంబ విలువలు, మనం ఒక సమూహానికి చెందినవారమనే భావన ఎన్నడూ మారలేదు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున, 2014 మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాల తర్వాత భారతదేశంలో సంపూర్ణ మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి కోట్లాది మంది భారతీయుల నమ్మకం నన్ను ఆగనివ్వదు, అలసిపోనివ్వదు' అని చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్
మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్