Share News

పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ వ్యూహరచన.. సోనియా నివాసంలో కీలక భేటీ

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:05 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ జులై 16వ తేదీన కీలక సమావేశం నిర్వహించనుంది.

పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ వ్యూహరచన.. సోనియా నివాసంలో కీలక భేటీ
Congress

ఢిల్లీ, జులై 14 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon Session) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అప్రమత్తమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ జులై 16వ తేదీన కీలక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో జరగనున్న ఈ భేటీలో సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రజా సమస్యలపై సోనియా గాంధీ (Sonia Gandhi) నేతృత్వంలో దిశానిర్దేశం చేయనున్నారు.


జులై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్ష నేతలపై చర్యల అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు, జులై 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం స్వీకరించనుంది.


ఇక రానున్న వర్షాకాల సమావేశాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారనున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) జులై 17వ తేదీన పార్లమెంట్‌కు నివేదిక సమర్పించనుంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే నిబంధన తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. జైల్లో నుంచే పాలన సాగించే పరిస్థితులకు ముగింపు పలకడమే ఈ బిల్లు లక్ష్యమని కేంద్రం చెబుతోంది.


అయితే ఈ ప్రతిపాదనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడే అవకాశం ఉందని కాంగ్రెస్ సహా పార్టీలు ఆరోపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, సామాజిక సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 01:33 PM