Share News

సీజేపీతో చర్చలకు కేంద్రం ముందడుగు?

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:38 PM

పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టిన సీజేపీతో కేంద్రం చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నట్టు సీజేపీ వెల్లడించింది.

సీజేపీతో చర్చలకు కేంద్రం ముందడుగు?

ఇంటర్నెట్ డెస్క్: పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం ప్రకటించింది. తమ డిమాండ్లను వివరించేందుకు ఇద్దరు అధికార ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు సీజేపీ వెల్లడించింది. అయితే.. ఈ చర్చల అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.


ఇదిలా ఉండగా.. పరీక్షల అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది సీజేపీ కార్యకర్తలు, నిరసనకారులు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పార్లమెంట్ వైపునకు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ బలగాలు, సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా.. పలువురు పోలీసులు, సీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. ఈ క్రమంలో పార్లమెంట్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల మధ్య సీజేపీ ప్రతినిధులు.. జేపీ నడ్డాతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల అనంతరం పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. సీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్..

Updated Date - Jul 20 , 2026 | 02:00 PM