ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. సీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్..
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:35 AM
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ (సోమవారం) పార్లమెంట్ మార్చ్ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు, మద్దతుదారులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో భద్రతా దళాలు లాఠీఛార్జ్ చేశాయి.
ఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ (సోమవారం) పార్లమెంట్ మార్చ్ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు, మద్దతుదారులు జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు కూడా హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు పెద్దఎత్తున మోహరించాయి.
ర్యాలీ ప్రారంభమైన వెంటనే నిరసనకారులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది, సీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు లాఠీఛార్జ్ చేశాయి. పలువురిని అరెస్టు చేశారు. మరోవైపు, ఇప్పటికే పార్లమెంట్‌కు వెళ్లే అన్ని మార్గాలను అధికారులు మూసివేశారు. జంతర్ మంతర్‌తో పాటు పటేల్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, రైల్ భవన్ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఐదు మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. అలాగే సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. ర్యాలీలో మద్దతుదారులంతా శాంతంగా ఉండాలని కోరింది. పోలీసులు అడ్డగించినప్పటికీ ప్రశాంతంగా ఉండాలని.. శాంతి, ప్రేమతో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని పేర్కొంది. నీట్ పేపర్ సహా వివిధ ప్రశ్నపత్రాల లీకేజీలపై సీజేపీ కార్యకర్తలు కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు. పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన..
సీఎం విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు..