Share News

రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:14 PM

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమావేశాలకు ముందు పార్లమెంట్ భవనం వెలుపల ప్రసంగిస్తూ రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..
PM Modi Comments on Rahul Gandhi

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమావేశాలకు ముందు పార్లమెంట్ భవనం వెలుపల ప్రసంగించిన మోదీ.. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయానికి కారణమైన యువ శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అదే సమయంలో ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 విజయవంతంగా కక్ష్యలోకి చేరడం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టుపై పని చేసిన బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదంటూ రాహుల్ గాంధీపై పరోక్షంగా సెటైర్ వేశారు. ఇటీవల 56 ఏళ్లు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా ప్రచారం చేస్తుండటాన్ని ఉద్దేశించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


2014 లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీది '56 అంగుళాల ఛాతీ' అంటూ పలువురు బీజేపీ నేతలు చెప్పారు. ఈ వ్యాఖ్యను కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాల్లో విమర్శలకు ఉపయోగించారు. ఈ ఏడాది పార్లమెంట్‌లో చైనా అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. '56 అంగుళాల ఛాతీ ఏమైంది?' అంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే ఇప్పుడు మోదీ '56 ఏళ్ల యువకుడు' అంటూ కౌంటర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూనే స్కైరూట్ యువ బృందం సాధించిన విజయం దేశ యువతలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠ రోజురోజుకూ పెరుగుతోందని, దేశ యువత ఆశయాలకు ఆకాశమే హద్దు కాదనే సందేశాన్ని ఈ విజయం ఇచ్చిందన్నారు.


మరోవైపు, వర్షాకాల సమావేశాలు దేశ ప్రయోజనాల దిశగా సాఫీగా సాగాలని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్‌లో వాస్తవాలు, తర్కంతో కూడిన చర్చలు జరగాలని సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సభ్యుడి స్వరం వినిపించేలా సభ నడవాలని, అనవసర గందరగోళానికి తావు లేకుండా ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని ప్రధాని మోదీ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. సీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్..

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

Updated Date - Jul 20 , 2026 | 01:19 PM