Share News

బిహార్ సీఎం సంచలన ప్రకటన.. నేడే రాజ్యసభకు నామినేషన్!

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:11 PM

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్టు స్వయంగా వెల్లడించారు.

బిహార్ సీఎం సంచలన ప్రకటన.. నేడే రాజ్యసభకు నామినేషన్!
Nitish Kumar

ఇంటర్నెట్‌డెస్క్‌: జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా 'ఎక్స్‌' వేదికగా ధ్రువీకరించారు. దీంతో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు తాను మూడు సభల్లో సభ్యుడిగా ఉన్నానని, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించి 'నాలుగు సభల క్లబ్'లో చేరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.


'రెండు దశాబ్దాలుగా మీరు నన్ను నమ్మి ఎంతో మద్దతిచ్చారు. అంకితభావంతో నా నేను విధుల్ని నిర్వర్తించాను. మీ మద్దతు, నమ్మకం వల్లే బిహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. నా పార్లమెంటరీ జీవితం ప్రారంభించినప్పటి నుంచి నా మనసులో ఓ కోరిక ఉంది. రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలతో పాటు పార్లమెంట్‌లోని ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నాను. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను. నూతన బాధ్యతలు చేపట్టాక కూడా బిహార్‌తో నా బంధం ఇలాగే కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు అందిస్తాను' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు నితీశ్ కుమార్.


నితీశ్ తాజా ప్రకటనతో.. బిహార్‌కు నూతన ముఖ్యమంత్రి ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతకే సీఎం పదవీ బాధ్యతలు దక్కవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ ఆశావహులు సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్నారు. ఆ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌ కుమార్ సిన్హా, రాష్ట్ర మంత్రి దిలీప్ జాయస్‌వాల్‌, దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.


బిహార్‌లో గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. బీజేపీ, జేడీయూ కూటమి తరఫున నితీశ్ కుమార్ రికార్డ్ స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే.. దేశ వ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లేందుకు ఈ రోజే ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.


ఇవీ చదవండి:

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా

Updated Date - Mar 05 , 2026 | 01:18 PM