భోపాల్‌లో ప్రమాదకర పాక్ ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాల కలకలం
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:46 PM
పాకిస్తాన్‌లో తయారైన ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అమ్ముడుపోవడం కలకలం రేపింది. వినియోగదారుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్‌లో తయారైన ఫెయిర్‌నెస్ క్రీమ్ అమ్మకాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అమ్ముడుపోవడం కలకలం రేపింది. వినియోగదారుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది. ‘గోరీ’ (తెల్లగా ఉన్న అని అర్థం. మహిళలను ఉద్దేశించి వాడుతారు) అనే పేరుతో ఆ క్రీములను మార్కెట్లో అమ్మారు. అంతేకాకుండా ఈ కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానూ మధ్యప్రదేశ్ వ్యాప్తంగా అమ్మకాలు జరిపారు. ఒక్కో క్రీమ్ ధర రూ.180 నుంచి రూ.800 వరకు ఉంది. ఆ ఉత్పత్తులపై మేడిన్ పాకిస్తాన్ అని రాసి ఉంది. దీంతో ఆ అమ్మకాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్ ఉత్పత్తులు మన దేశ మార్కెట్లోకి ఎలా వచ్చాయో ట్రేస్ చేసే పనిలో పడ్డారు.
5700 రెట్లు పాదరసం స్థాయులు
పాక్ ఫెయిర్‌నెస్ క్రీముల్లో పాదరసం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. అనుమతించిన సేఫ్ లిమిట్ 1 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) కన్నా 5700 రెట్లు ఎక్కువగా పాదరసం ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని చెప్పారు. అలాంటి క్రీములు వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రేరణా శర్మ హెచ్చరించారు. మన శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని పాదరసం అడ్డుకుంటుందని, అంతేకాకుండా కిడ్నీలు, నరాలు, మెదడుపైనా తీవ్ర దుష్ర్పభావం పడుతుందని ఆమె తెలిపారు.
కాగా.. పాక్ ఫెయిర్‌నెస్ క్రీములు వాడి మహారాష్ట్రలో 18 మంది మహిళలకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో పాక్ ఉత్పత్తుల చెయిన్ నెట్‌వర్క్ దేశంలో ఎక్కడెక్కడుందో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పాక్ ఉత్పత్తుల అమ్మకాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. బాధ్యులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...