Share News

అంతమంది జర్నలిస్టులను చూసి నా గుండె వేగంగా కొట్టుకుంది: సోనియా

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:10 PM

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1999లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించినపుడు ఎదురైన ఒత్తిడి, అనిశ్చితి తనను బాగా ఆందోళనకు గురిచేశాయని ఆమె తెలిపారు.

అంతమంది జర్నలిస్టులను చూసి నా గుండె వేగంగా కొట్టుకుంది: సోనియా

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1999లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించినపుడు ఎదురైన ఒత్తిడి, అనిశ్చితి తనను బాగా ఆందోళనకు గురిచేశాయని ఆమె తెలిపారు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని, తన రాజకీయ జీవితంలో అంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడడం అదే మొదటిసారి అని ఆమె పేర్కొన్నారు.


1999లో అన్నాడీఎంకే చీఫ్ జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌.. ప్రాంతీయ, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 272. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలకు కలిపి 233 మంది ఎంపీల బలం ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని మరికొందరు హామీ ఇచ్చారని సోనియా తన ఆత్మకథలో పేర్కొన్నారు. దీంతో అవసరమైన సంఖ్యాబలం సమకూరుతుందనే నమ్మకంతో రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరామని ఆమె వివరించారు.


అయితే ..రాష్ట్రపతి భవన్‌ వెలుపల మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని సోనియా గుర్తుచేశారు. ‘272 మంది సభ్యుల మద్దతు ఉందని చెబుతున్నారు. ఆ సంఖ్యను ఎలా లెక్కించారు?' అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారని తెలిపారు. అలాగే 'మీ పార్టీ అహంకారమే ఈ పరిస్థితికి కారణం కాదా?' అని మరో ప్రతినిధి అడిగారని తెలిపారు. తమ లెక్కలను మిత్రపక్షాల నేతలతో చర్చించిన తర్వాతే సిద్ధం చేశామని సమాధానమిచ్చినట్లు సోనియా వెల్లడించారు. ఆ సమయంలో అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా.. ఇతర పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని, మెజారిటీ సాధిస్తామనే విశ్వాసం ఉందని పేర్కొన్నట్లు వెల్లడించారు. కానీ, చివరకు తాము ఆశించిన మద్దతు లభించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన నేతల్లో పలువురు ప్రధానమంత్రి పదవిని ఆశించడమే చర్చలు విఫలం కావడానికి ఒక కారణమని వివరించారు. అయితే, తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదని సోనియా స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతోనే తొందరపడి ముందుకెళ్లానని అంగీకరించారు.


ఇవి కూడా చదవండి..

వాయుకాలుష్యం.. ఉత్తరాదిన గగనతలంలో దట్టమైన పొగ

ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ

Updated Date - Nov 11 , 2026 | 03:10 PM