తొమ్మిది పెళ్లిళ్లు.. ఏడో భర్తపై వేధింపుల కేసు..
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:11 AM
తొమ్మిది సార్లు వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళ.. తన ఏడో భర్తపై వేధింపుల కేసు పెట్టింది
వరకట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపణఆధారాలు లేవంటూ పక్కన పెట్టేసిన కర్ణాటక హైకోర్టు
బళ్లారి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది సార్లు వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళ.. తన ఏడో భర్తపై వేధింపుల కేసు పెట్టింది. తన భర్త వరకట్నం కోసం వేధిస్తూ క్రూరత్వం చూపిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చేసిన ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవంటూ కర్ణాటక హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది. ఈ కేసులో ఏడో భర్తగా పేర్కొన్న హోస్పేట్‌కు చెందిన రాజకీయ నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నాగప్రసన్న బెంచ్ విచారించింది. వరకట్న వేధింపులు, క్రూరత్వం చూపినట్లు నమోదైన కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని తెలిపింది. అందుకే ఉడుపి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు విచారణను రద్దు చేస్తున్నామని పేర్కొంది. హోస్పేట్‌కు చెందిన రాజకీయ నాయకుడైన తన భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీనిపై ఉడుపి కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళ (భార్య) ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు వివాహం చేసుకున్నారని, ప్రతి పెళ్లి తర్వాత వివాదాలు సృష్టించడం, కేసులు నమోదు చేయించడం, అనంతరం రాజీకి రావడం ఆమెకు అలవాటుగా మారిపోయిందని కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. అయితే ఈ ఆరోపణలను మహిళ ఖండించారు. తాను నాలుగు సార్లు మాత్రమే పెళ్లి చేసుకున్నానని, ప్రతి వివాహం అనంతరం విడాకులు, తలాక్ లేదా ఖులా ద్వారా చట్టబద్ధంగా విడిపోయామని తెలిపారు. ఆ తర్వాతే మరో వివాహం చేసుకున్నానని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ నాగప్రసన్న.. మహిళ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ రాజకీయ నాయుకుడిపై నమోదైన కేసును కొట్టివేశారు.
ఇవి కూడా చదవండి..
వాయుకాలుష్యం.. ఉత్తరాదిన గగనతలంలో దట్టమైన పొగ
ఐఏఎస్ అధికారికి టీవీకే ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపారు.. కనిమొళి ఆరోపణ