స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు విముక్తి.. అమిత్ షా వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:35 AM
స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు 35 ఏళ్ల తరువాత విముక్తి లభించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. తాజాగా జరిగిన లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు 35 ఏళ్ల తరువాత విముక్తి లభించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. తాజాగా జరిగిన లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో ఈ పరిణామం కీలక మైలు రాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency-NIA) నేతృత్వంలో జరుగుతున్న 'యాంటీ-టెర్రర్ కాన్ఫరెన్స్ 2026’లో నిన్న (గురువారం) అమిత్ షా పాల్గొన్నారు. దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తు జరిపి, దాన్ని నిర్మూలించాలని ఆయన ప్రసంగించారు. అందరూ ఏకమై పోరాడితేనే టెర్రరిజం అంతమవుతుందని వివరించారు. ఉగ్రవాదం విషయంలో తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని వెల్లడించారు. 2019 నుంచి పరారీలో ఉన్న 303 మంది ఉగ్రవాదులను, 36 దేశాల నుంచి తాము రప్పించామని చెప్పారు.
లతీఫ్ భట్ హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గత బుధవారం (నవంబర్ 18) జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. ఓ మసీదులో దాక్కున్న లతీఫ్ భట్‌ను లొంగిపోవాలని భారత భద్రతా బలగాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు నిరాకరించిన అతడు.. బలగాలపై కాల్పులు జరిపాడు. వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆ ఉగ్రవాది మృత్యువాత పడ్డాడు. దీంతో జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. దీనిపై స్పందించిన అమిత్ షా.. స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు విముక్తి లభించిందంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలూ చదవండి
ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం
454 చెట్ల నరికివేత.. వ్యాపారికి మరో రూ.50 లక్షల జరిమానా